కింకర్తవ్యం?

TDP Activists Conflicts in Chandrababu Naidu Kurnool Tour - Sakshi

కర్నూలులో ముగిసిన చంద్రబాబు పర్యటన

ఓటమి మరచి ‘స్థానిక’ సమరంలో పుంజుకోవాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం

జిల్లాలో పార్టీ ఉనికే లేకపోవడంతో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ‘తమ్ముళ్లు’

అధికారంలో ఉన్న ఐదేళ్లూ కార్యకర్తలను విస్మరించారని నిలదీత

‘స్థానిక’ ఎన్నికల్లోపే పార్టీ వీడి..మరో దారి చూసుకునే యోచన

శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోయిన చంద్రబాబు

‘2014 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమీక్షలు నిర్వహించి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు అండగా ఉంటాం.. అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు తిరిగి ప్రతిపక్ష నేతగా సమీక్షలు చేస్తూ అవే మాటలు చెబుతున్నారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కార్యకర్తలు గుర్తుకు రాలేదు. అప్పటి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు మినహా..కార్యకర్తలు బాగుపడింది లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నమ్ముకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఏదో పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటాది.’’    – సమీక్ష సమావేశంలో ఓ టీడీపీ కార్యకర్త నేరుగా చంద్రబాబు, ఇన్‌చార్జ్‌లను నిలదీసిన వైనమిది.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనివిధంగా ఘోర ఓటమి.. దాని నుంచి తేరుకోకముందే తరుముకొస్తున్న ‘స్థానిక’ ఎన్నికలు.. జిల్లాలో నాయకత్వం లేదు.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా లేదు.. పార్టీలో పదవులు అనుభవించిన వారే నాయకత్వంపై నమ్మకం లేక సైకిల్‌ దిగి పోతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను, కార్యకర్తలను సంసిద్ధులను చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో మూడురోజులు మకాం వేశారు. నగర శివారులోని ఓ ఫంక్షన్‌ హాలులో సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సమీక్షల్లోని సారాంశం ఒక్కటే.. ‘తొందర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి.

జిల్లాలో 2 ఎంపీ, 14 ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయామనే బాధను మరచిపోండి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని, ప్రతి అంశాన్ని విమర్శించండి. మాటల దాడి చేసి ఎలాగైనా ప్రజల్లో  వ్యతిరేకతను పెంచాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా గెలవాలి’ అని చంద్రబాబు చెప్పారు. ఇదే క్రమంలోసమీక్షకు హాజరైన మెజార్టీ కార్యకర్తలు పరస్పరం చర్చించిన అంశం కూడా ఒక్కటే!  ‘గత నాలుగు సార్వత్రిక ఎన్నికలు చూస్తే టీడీపీ అత్యధికంగా  గెలిచింది నాలుగు ఎమ్మెల్యే సీట్లే. ఈ సారి ఒక్కటీ గెలవలేదు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాక తప్పదు. వీళ్లని నమ్ముకుని గట్టిగా ఎన్నికలకు వెళితే గొడవలు తప్పవు. తర్వాత పార్టీ అండ ఉండదు. కాబట్టి ఎవరిదారి వారు చూసుకోవడం మంచిది’ అని చర్చించుకున్నారు. చంద్రబాబు మాటలు, కార్యకర్తలు చర్చించుకున్న అంశాలను బేరీజు వేస్తే టీడీపీ నాయకత్వంపై కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లిందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో టీడీపీని, జిల్లాలోని ఆ పార్టీ నేతలను నమ్ముకుని రాజకీయంగా పతనమవ్వడం కంటే.. భవిష్యత్తు ఉన్న పార్టీలో చేరడం మేలని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

‘స్థానిక’ పోరులో వైఎస్సార్‌సీపీదే పైచేయి
జిల్లాలో 889 పంచాయతీలు ఉన్నాయి. 2013 పంచాయతీ ఎన్నికలలో 70 శాతం స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అలాగే జిల్లాలో 53 జెడ్పీటీసీ, 814 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన పోరులో 30 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 20 స్థానాల్లో టీడీపీ విజయం సాధించాయి. రెండుచోట్ల కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 395, టీడీపీ 333 చోట్ల విజయం సాధించాయి. తక్కిన స్థానాలను ఇతర పార్టీలు పంచుకున్నాయి. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక పోరులో టీడీపీ విజయం సాధించి..రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది. అలాంటి ఎన్నికల్లో కూడా జిల్లాలో వైఎస్సార్‌సీపీనే మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. రెండు ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవగా.. టీడీపీ కేవలం మూడు ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం సీట్లను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. పైగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ఆర్నెళ్లలోనే అమలు చేశారు. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ అందుతున్నాయి.

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పాలనలో సంస్కరణలు తీసుకొచ్చి గ్రామస్థాయికి పథకాలను తీసుకెళుతున్నారు. అనతి కాలంలోనే వేల ఉద్యోగాలను జిల్లాలో కల్పించారు. ఇళ్లు లేని వారందరికీ మార్చిలో మహిళల పేరుతో స్థలాలను ఇస్తున్నారు. గతంలో లాగా పట్టాలు కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసివ్వనున్నారు. దీనికితోడు వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా ఉంది.  ఈ క్రమంలో ‘స్థానిక’ పోరు జరిగితే ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలిచే అవకాశం ఉంది. గత ఐదేళ్లూ నిరుద్యోగులు, రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేయడం,  ప్రస్తుతం అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉండటంతో ‘స్థానిక పోరు’లో ఫలితాలు ఏకపక్షంగా ఉండటం ఖాయమనే భావన ప్రజలతో పాటు టీడీపీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది.

నేతలను నమ్మి బరిలో నిలవలేం..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా దండుకున్నారని స్వయాన ‘తమ్ముళ్లే’ అంటున్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిందని చెబుతున్నారు. ‘పార్టీకి తిరిగి జీవం పోయాలని కార్యకర్తలకు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడాలంటే గొడవలు పడడంతో పాటు అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఫ్యాక్షన్‌తో కుటుంబాలు నలిగిపోయాయి. వీరిని నమ్ముకుని మళ్లీ తప్పు చేయలేమ’ని కోడుమూరుకు చెందిన ఓ కార్యకర్త  ‘సాక్షి’తో అన్నారు.

జిల్లాలో టీడీపీకి భవిష్యత్తు లేదని, 20 ఏళ్లలో ఏనాడూ సగం ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలవలేదని, దీంట్లో కొనసాగితే తమకు కూడా ఉపయోగం ఉండదని, అందుకే వేరే దారి చూసుకుంటామని ఓ మాజీ మండలాధ్యక్షుడు వ్యాఖ్యానించారు. వీరి మాటలను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది. ‘స్థానిక పోరు’కు సిద్ధమయ్యేందుకు పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంలో చంద్రబాబు విఫలమైనట్లు అవగతమవుతోంది. పైగా కోడుమూరు, నందికొట్కూరు ఇన్‌చార్జ్‌లు గైర్హాజరు కావ డం, చాలామంది మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కూడా రాకపోవడం చూస్తే టీడీపీలో కొనసాగడం కంటే ఇతర పార్టీల్లోకి వెళ్లి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం మంచిదని, ఎన్నికలకు ముందే సైకిల్‌ దిగి ప్రత్యామ్నాయం చూసుకోవాలనే యోచనలో వారు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

సోమిశెట్టిని వేదికపైకి తీసుకెళ్తున్న పార్టీ నాయకులు   
ఓటమిపై సమీక్షేదీ?
కర్నూలు(సెంట్రల్‌) : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి గల కారణాలను చంద్రబాబు సమీక్షించకపోవడంపై సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తమైంది. చంద్రబాబు ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు నగర శివారులోని ఓ కన్వెన్షన్‌ హాలులో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మొదటి రోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, రెండో రోజు నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, నంద్యాల, మూడో రోజైన బుధవారం కర్నూలు, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అయితే.. ఎక్కడా ఓటమికి గల కారణాలను విశ్లేషించకుండా కేవలం ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై విమర్శలకే సమయాన్నంతా కేటాయించారు.

అలాగే పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఇది ఆ పార్టీ శ్రేణులకే నచ్చలేదు. ఇక చాలా మంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తాము గొప్పగా పనిచేస్తున్నామని ముందుగానే ఎంపిక చేసుకున్న కార్యకర్తలు, నాయకులతో చెప్పించుకుని చంద్రబాబు ఎదుట మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించారని కొందరు కార్యకర్తలు చర్చించుకోవడం కన్పించింది. పార్టీ ముఖ్య నాయకులైన కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌తోపాటు మరికొందరు మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో చురుగ్గా వ్యవహరించలేదనే వాదన ఉంది. దీంతో పాటు కొందరు నేతలు డుమ్మా కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సమీక్షలతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.  

సోమిశెట్టిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్లికార్జునరెడ్డి, ఆయన వర్గీయులు
సోమిశెట్టిపై దాడి..
పాణ్యం సమీక్ష తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుపై దాడి జరిగింది. సమీక్ష ముగిసిన తరువాత చంద్రబాబుతో ఫొటోలు దిగేందుకు కేడీసీసీ మాజీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, టీడీపీ నాయకుడు మల్లెల పుల్లారెడ్డి వర్గాలు ప్రయత్నించాయి. అయితే సోమిశెట్టి మొదట మల్లెల పుల్లారెడ్డి వర్గానికి అవకాశం ఇచ్చారు. తరువాత మల్లికార్జున రెడ్డి వర్గంలోని కార్యకర్తలకు అవకాశం రాగా ఒక్కరే రావాలని పిలవడంతో చంద్రబాబు ఎదుటే సోమిశెట్టిని తోసేశారు. కొందరు పిడిగుద్దులు గుద్దారు. అయితే చంద్రబాబు పిలుస్తున్నా మల్లికార్జున రెడ్డి ఫొటో దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, పాణ్యం నియోజకవర్గ సమీక్షకు గతంలో ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి డుమ్మా కొట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top