‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’

Tammineni Veerabhadram: We will Take Revenge For Thumb Injury - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్‌మీట్‌ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు.

నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్‌ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్‌ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావే
ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్‌... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్‌(న్యూ డెమోక్రసీ) కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు.

అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్‌లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని  కేసీఆర్‌ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. 

పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు
పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్‌ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు
తెలంగాణ వచ్చాక హిట్లర్‌, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్‌ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్‌నగర్‌ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్‌నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్‌లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top