టీఆర్‌ఎస్‌ ఎలా ఓడిపోయింది : శ్రీధర్‌బాబు

Sridhar Babu Slams Defective MLAs Over CLP Merge - Sakshi

సాక్షి, పెద్దపల్లి :  హైకోర్టు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వారిపై స్పీకర్‌ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఫిరాయించడాన్ని దేశంలోని ఏ రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయంటున్న ఎమ్మెల్యేలకు.. టిక్కెట్లు అడిగేటప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తమ పార్టీలో నాయకత్వ లోపం ఉందని అనడం వెనుక అసలు ఉద్దేశమేమిటో చెప్పాలన్నారు. తాము పార్టీలు మారడానికి ప్రజలు అంగీకారం తెలిపారని అంటున్నారు కదా..అలా అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార పార్టీ 7 స్థానాల్లో ఎలా ఓడిపోయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

కాగా రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్‌ఎస్‌లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వీరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె‍ల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ముఠా రాజకీయాలతో సతమతమవుతోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు పైవిధంగా స్పందించారు.

చదవండి : రాజ్యాంగం ప్రకారమే సీఎల్పీ విలీనం : రేగా కాంతారావు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top