పదింతలై పోరాడుతాం | Rahul Gandhi Pleads Not Guilty in Defamation Case | Sakshi
Sakshi News home page

పదింతలై పోరాడుతాం

Jul 5 2019 3:06 AM | Updated on Jul 5 2019 8:43 AM

Rahul Gandhi Pleads Not Guilty in Defamation Case - Sakshi

ముంబైలో కోర్టు ఆవరణలో రాహుల్‌గాంధీ

సాక్షి, ముంబై: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పది రెట్లు బలంగా పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. పరువు నష్టం కేసులో గురువారం ముంబైలోని మజ్‌గావ్‌–శివ్డీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు, ఉపాధి, యువత సమస్యలు తదితరాలపై మా పోరాటం కొనసాగుతుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సైద్ధాంతికపరమైన పోరు కొనసాగిస్తా. ఐదేళ్లుగా సాగిస్తున్న దాని కంటే పది రెట్లు గట్టిగా పోరాడుతా’ అని ప్రకటించారు.

నిర్దోషులమన్న రాహుల్, ఏచూరి
పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మజ్‌గావ్‌–శివ్డీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. మేజిస్ట్రేట్‌ పీఐ మొకాషి కోర్టులో ఇద్దరు నేతల పేర్లను పిలవగానే వారు సాక్షుల బోనులోకి వెళ్లి నిలబడ్డారు. వారిపై వచ్చిన ఫిర్యాదును ఆయన చదివి వినిపించి.. నేరాన్ని అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించగా నిర్దోషులమని వారు బదులిచ్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వారిద్దరితోపాటు ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

రాహుల్, సీతారాం ఏచూరికి కోర్టు రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. కేసు విచారణకు హాజరు కానవసరం లేకుండా వారికి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 21వ తేదీన జరగనుంది. అవసరమైన పత్రాలపై సంతకాలు చేసిన ఇద్దరు నేతలు అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చారు. జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందంటూ రాహుల్, ఏచూరి ఆరోపించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త, న్యాయవాది ధ్రుతిమన్‌ జోషి 2017లో కేసు వేశారు. కాంగ్రెస్, సీపీఎంలపైనా కేసులు నమోదు చేయాలని ధ్రుతిమన్‌ కోరారు. కానీ, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు పార్టీలను బాధ్యులుగా చేయడం తగదంటూ కోర్టు తిరస్కరించింది. ఆ మేరకు ఫిబ్రవరిలో ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి.

అంతకుముందు రాహుల్‌ కోర్టు గేట్‌ వద్దకు రాగానే అక్కడ వేచి ఉన్న దాదాపు 250 మంది పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి చేసిన రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాహుల్‌ మాత్రం వారికి అభివాదం చేస్తూ కోర్టు ఆవరణలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పించారు. అంతకుముందు ముంబై ఎయిర్‌పోర్టు వద్ద కూడా కాంగ్రెస్‌ శ్రేణులు ఇవే నినాదాలు చేశాయి. కాగా, ఇది మహారాష్ట్రలో రాహుల్‌పై దాఖలైన రెండో పరువు నష్టం కేసు. మహాత్మాగాంధీ హత్య కేసుతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధముందని ఆరోపించారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త ఒకరు భివండీలో వేసిన కేసు ఇప్పటికే నడుస్తోంది.  

ఆ ధైర్యం కొందరికే ఉంటుంది: ప్రియాంక
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న  రాహుల్‌ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్‌ రాజీనామా నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆమె.. అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్నారు.   

ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్‌ వీడియో
ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ నిమిషం నిడివి ఉన్న ఒక వీడియోను ట్విట్టర్‌లో గురువారం విడుదల చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఫర్‌ డమ్మీస్‌ పేరుతో ఉన్న ఆ వీడియోలో... ‘ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి మీకు తెలుసని అనుకోండి, మరోసారి ఆలోచించండి. బ్రిటిష్‌ పాలకులకు విధేయత ప్రకటించడం, మహాత్మాగాంధీని చంపడం వంటి హింసాత్మక చర్యల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆది నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది’అని ‘ఆర్‌ఎస్‌ఎస్‌ వెర్సెస్‌ ఇండియా’అనే హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్‌ పేర్కొంది.

కోర్టు కేసులతో రాహుల్‌ బిజీ!
ఇంత వరకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో సతమతమైన రాహుల్‌ గాంధీ ఇక నుంచి కోర్టు కేసులతో బిజీ కానున్నారు.  ఆరెస్సెస్‌ కార్యకర్త దాఖలు చేసిన ఒక పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ గురువారం ఇక్కడి మజ్‌గావ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో నేరాన్ని అంగీకరించకపోవడంతో కేసు విచారణ కొనసాగనుంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 22కు వాయిదా వేసిన మేజిస్ట్రేట్‌ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని రాహుల్‌కు మినహాయింపు ఇచ్చారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యకు ఆరెస్సెస్‌కు సంబంధం ఉందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యపై ఆరెస్సెస్‌ ఈ కేసు దాఖలు చేసింది.

కాగా, థానే జిల్లా భివండీలో రాహుల్‌ మరో పరువునష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కూడా ఆరెస్సెస్‌ వేసిందే.ఈ కేసు విచారణ ఇంకా ప్రారంభం కావలసి ఉంది. గాంధీ హత్యకు సంఘ్‌పరివార్‌ బాధ్యులని రాహుల్‌ ఆరోపించడంతో ఆయనపై ఈ కేసు దాఖలయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ‘ఈ దొంగలందరికీ మోదీ అన్న పేరెందుకుందో’అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ కేసు పెట్టారు. ఈ పరువునష్టం కేసులో రాహుల్‌ ఈ నెల 6వ తేదీన బిహార్‌లోని పాట్నా కోర్టులో హాజరు కావలసి ఉంది. అహ్మదాబాద్, సూరత్‌ కోర్టుల్లో కూడా రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement