కాంగ్రెస్‌ జోష్‌

Rahul Gandhi Criticised On KCR In Adilabad - Sakshi

‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ చిరకాల స్వప్నం ఐదేళ్లలో సాకారం కాలేదు... కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన కుటుంబానికి ఉపయోగపడ్డాడు. తెలంగాణ ప్రజలు కన్న కలలు నీరుగార్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మీ కలలు నిజమవుతాయి. కేసీఆర్‌ అవినీతికి పాల్పడి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చారు. దేశమంతా కొనియాడుతున్న అంబేద్కర్‌ పేరును లేకుండా చేశారు’’ అంటూ సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగం ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రజానీకానికి చేరువైంది. అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తూ నిర్మల్‌ జిల్లా భైంసాలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. 

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కావలసిన రాహుల్‌ సభ ఆయన పర్యటనలో మార్పుల కారణంగా గంటన్నర ఆలస్యమైంది. నాయకులు ఆశించిన దాని కన్నా జనం పోటెత్తడం గమనార్హం. ముథోల్‌ నియోజకవర్గంలోని పలు మండలాలు, భైంసా పట్టణంతో పాటు నిర్మల్, ఖానాపూర్, బోథ్‌ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన రాహుల్‌ సభకు తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నాయకులు కూడా జన సమీకరణకు పోటీ పడ్డారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో భారీ ఎత్తున జనంతో సభ విజయవంతమైంది. సభకు పోటెత్తిన జనాన్ని చూసి రాహుల్‌గాంధీతో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

స్థానిక పరిస్థితుల నుంచి అంతర్జాతీయ అంశాల వరకు...
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో అన్ని అంశాలపై ఫోకస్‌ చేశారు. ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఉమ్మడి జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టు అంశాన్ని అంబేద్కర్‌ పేరుకు లింక్‌ చేస్తూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టడం సభకు హాజరయిన ప్రజానీకాన్ని ఆలోచింపజేసింది. కేసీఆర్‌ అవినీతిలో భాగంగానే రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా రూ.లక్ష కోట్లకు పెరిగిందని చెపుతూనే... అంబేద్కర్‌ను దేశమంతా గౌరవిస్తుంటే కేసీఆర్‌ అవమానిస్తున్నారని తనదైన శైలిలో చెప్పడం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో అత్యధికంగా సాగయ్యే పత్తి పంటకు మద్ధతు ధరను రూ.7వేలుగా ప్రకటించిన రాహుల్‌గాంధీకి రైతులు హర్షద్వానాలతో మద్దతు పలికారు. ఆదివాసీలకు భూమిపై యూపీఏ ప్రభుత్వం కల్పించిన హక్కును కేసీఆర్‌ నీరు గార్చారని వివరించి వారి సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆదివాసీలు, రైతులకు యూపీఏ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం నిర్బంధంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పి కొత్త చర్చను లేవనెత్తారు.

ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ విమానాల కొనుగోలు, అనిల్‌ అంబానీకి ఉదారంగా రూ.30వేల కోట్లు లబ్ధి చేకూర్చడంపై రాహుల్‌ చేసిన ప్రసంగానికి జనం నుంచి అంతగా స్పందన లభించలేదు. అయినా జాతీయ, అంతర్జాతీయ అంశంగా మారిన రాఫెల్‌ విమానాల కొనుగోళ్ల అంశాన్ని గత కొంతకాలంగా దేశంలో ఎక్కడ సభ జరిగినా ప్రస్తావించడం జరుగుతోంది. స్థానికంగా ఇది తలకెక్కకపోయినా... జాతీయ, అంతర్జాతీయ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుందనే రాహుల్‌ ఆలోచనగా కాంగ్రెస్‌ నాయకులు చెపుతున్నారు. అదే సమయంలో కేసీఆర్, మోదీ తరహాలో తాను అబద్ధాలు చెప్పనని, అబద్ధపు మాటలు వినాలనుకుంటే వారి సభలకే వెళ్లాలని స్పష్టం చేయడం ద్వారా తాను నిజాయితీపరుడనని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌పై రాహుల్‌ చేసిన విమర్శలకు పెద్ద ఎత్తున స్పందన లభించింది.
 
సభను విజయవంతం చేసిన నేతలు
రాహుల్‌గాంధీ పాల్గొనే తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలనే కసితో కాంగ్రెస్‌ నాయకులు జన సమీకరణ జరిపారని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సభను విజయవంతం చేయడంలో అన్నీ తానై వ్యవహరించారని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా నుంచి తన వర్గీయులుగా ఉన్న నాయకులందరిని జన సమీకరణకు ఉసిగొల్పి, తాను కూడా నిర్మల్‌ నుంచి భారీ ఎత్తున జనాన్ని వాహనాలతో తరలించారు. సభ వేదిక ఏర్పాటు చేసిన ముధోల్‌ నియోజకవర్గం పరిధిలో రామారావు పటేల్, నారాయణరావు పటేల్‌ సభ నిర్వహణతో పాటు జన సమీకరణలోనూ పోటీపడ్డారు. వచ్చిన కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేయడం ప్రశంసలను అందుకొంది.

మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు 60 బస్సులను ఏర్పాటు చేయించారు. కార్లు, ఇతర వాహనాల ద్వారా కూడా మంచిర్యాల నుంచి జనం తరలారు. సిర్పూరు నియోజకవర్గంలోని మారుమూరు ప్రాంతాల నుంచి 250 కిలోమీటర్లకు పైగా ఉన్న భైంసాకు ఉదయాన్నే కార్లు, బస్సుల్లో జనాన్ని తరలించడం గమనార్హం. సిర్పూరులో టికెట్టు ఆశిస్తున్న రావి శ్రీనివాస్, పాల్వాయి హరీష్‌బాబు పోటీపోటీగా జన సమీకరణ జరిపారు. ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు తనకు భారీగానే జనాన్ని తరలించారు.

చెన్నూరులో టికెట్టు రేసులో ఉన్న బోర్లకుంట వెంకటేశ్‌ నేత జన సమీకరణ భారీగానే చేపట్టారు. ఆదిలాబాద్‌లో గండ్రత్‌ సుజాత, భార్గవ్‌ దేశ్‌పాండే జన సమీకరణలో పోటీపడ్డారు. బోథ్‌ నుంచి సోయం బాపూరావు, అనిల్‌ జాదవ్‌ పోటాపోటీగా జన సమీకరణ జరిపారు. ఖానాపూర్‌లో రమేష్‌ రాథోడ్‌ తన విద్యాసంస్థలకు చెందిన వాహనాల ద్వారా జనాల్ని సభకు తరలించారు. హరినాయక్‌కు చెందిన వాహనాలు కూడా కనిపించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top