కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఉత్తమ్‌ 

Nobody can stop the Congress victory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నాయకుల అణచివేత ధోరణిపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మహబూబాబాద్‌కు చెందిన సీనియర్‌ నేత రాజవర్ధన్‌రెడ్డి, కార్వాన్‌కు చెందిన ఎంఐఎం నేత బందూలాల్‌ తమ అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉత్తమ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ, ప్రజా పాలన తెచ్చేందుకు, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే బాగుపడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజల ధనాన్ని దోచుకుని కేసీఆర్‌ కుటుంబం విలాస జీవితం గడుపుతుంటే, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు కష్టాలు అనుభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.   

దూకుడుగా వెళ్లండి  
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ, దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా సూచించారు. శనివారం గాంధీభవన్‌లో దక్షిణ తెలంగాణకు చెందిన పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన హామీలను స్థానిక నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కుంతియా సూచించారు. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని, ఆ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి కాంగ్రెస్‌ కార్యకర్తల ఓట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం మహ్మద్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top