‘పిచ్చి తుగ్లక్ బస్‌యాత్ర మొదలైంది’

Laxmi Parvathi Slams On Chandrababu Over TDP Bus Yatra - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘర పరాభవం ఎదురవనుందనే భయంతోనే చంద్రబాబు బస్సు యాత్ర మొదలు పెట్టారని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఓ మాజీ సీఎం వెంపర్లాడటం మొదటి సారి అని విమర్శించారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డిపాజిట్లు కూడా రావనే భయంతో బాబు బస్సు యాత్ర చేపట్టారని, ఆయన తీరు చూస్తే నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్టు ఉందన్నారు. ఆ ఘనుడు సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తనకు తెలిసి మూడు లక్షల కోట్ల అవినీతి సొమ్ము చంద్రబాబు దగ్గర ఉందని ఆమె పేర్కొన్నారు. పార్టీలో అంతర్గతంగా చంద్రబాబు పనికి రాడని. రామోజీ, రాధాకృష్ణ చెప్పారని తెలిసిందన్నారు. చంద్రబాబు కొడుకు కూడా పనికి రాడని చెప్పేశారని.. అందుకే వాళ్లను చంద్రబాబు బతిమిలాడుకున్నారని భోగట్టా. దాని కోసమే ఓ పక్క కేసులు ముంచుకొస్తున్నా జనంలోకి వచ్చి తిరుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. (‘గతంలో జరిగిన అక్రమాలకు బాబు సమాధానం చెప్పాలి’)

ఈ బస్సు యాత్రలో ఆయన చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆర్థికంగా, శారీరకంగా సీఎం వైఎస్‌ జగన్ తనని బాధపెడుతున్నారని బాబు చెబుతున్నారు. కానీ మానసికంగా చంద్రబాబు బాధ.. తన ఖర్మ అని ఆమె తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి ఓర్చుకోలేక బాధపడుతున్నారని.. ఇంత సిగ్గుమాలిన చర్యలు చంద్రబాబుకే తెలుసని ఆమె మండిపడ్డారు. 108లో ఓ కార్మికుడిని తీసుకెళుతుంటే దారి కూడా ఇవ్వలేదని ఆమె దుయ్యబట్టారు. అబద్ధాలే ధ్యేయంగా ఆ పార్టీ వాళ్లు జీవితం సాగిస్తున్నారని లక్ష్మి పార్వతి విమర్శించారు. చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కు ఉందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తొమ్మిది నెలల్లో సీఎం వైఎస్‌ జగన్ చేసిన పథకాలు చంద్రబాబు ఎప్పుడైనా చేశాడా అని ఆమె నిలదీశారు.( ‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’)

అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు సీఎం వైఎస్‌ జగన్ ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. 340 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అంటున్నారు.. ఆ జాబితా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. బాబు హయాంలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఎందుకు ఈ అబద్ధాల జీవితం, సింహంలా ఒకరోజు బతికినా చాలని ఆమె ఎద్దేవా చేశారు. ఐటీ సోదాలు జరిగిన వాళ్లు ఎవరు బాబుకు చెందిన వాళ్లు కాదా అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కబ్జాలు చేసి సింగపూర్ కంపెనీల ద్వారా అక్రమ సంపాదనను వైట్ మనీగా చేసుకోవాలని బాబు ప్రయత్నం చేశాడని లక్ష్మి పార్వతి మండిపడ్డారు.

3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తూ ముందుకు వెళుతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. అప్పుల్లో నింపిన చంద్రబాబు దార్శనికుడా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నిరుద్యోగ భృతిని ఎన్నికల స్టంట్‌గా ఇచ్చాడని ఆమె నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇంటికే పింఛన్‌ ఇస్తున్న తీరు కనిపించడం లేదా అని ఆమె మండిపడ్డారు. గత ఐదేళ్లల్లో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని చెప్పాలని.. తనను ప్రజలు దారుణంగా ఓడించి, అందరూ గడ్డి పెడుతున్నా మారవా అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సాక్షాత్తు ప్రతిపక్ష నేతను చంపించాలని చూశారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం శాంతిభద్రతలు సరిగి లేవనడం విడ్డూరం అన్నారు. టీడీపీ అధ్యక్ష పదవి పోతుందని పిచ్చి తుగ్లక్ లా రోడ్డున పడ్డారని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మారకపోతే ఇక బాబు క్షమార్హత కూడా కోల్పోతారని ఆమె హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top