రేణుదేశాయ్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు

Kurnool MLA Hafiz Khan Fires On Pawan kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను కర్నూలు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించారు. పవన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితం. కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్‌ అడుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అడగడం ఏంటి? 

చదవండి: అప్పుడే పవన్‌ సీమలో అడుగు పెట్టాలి..

చంద్రబాబు సూచన మేరకే ఆయన ఇప్పుడు కర్నూలు వచ్చారా? ఎఫ్‌ఐఆర్‌, ఛార్జ్‌షీట్‌ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. జరిగిన సంఘటనపై మరలా విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మళ్లీ విచారణ జరిపిస్తున్నాం. విచారణ కోసం ఒక మహిళా అధికారిని ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు హయాంలో జరిగిన సంఘటనపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్లు పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌ వల్ల రేణు దేశాయ్‌ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. 

చదవండి: మమ్మల్ని కాదు... పవన్‌ను అరెస్ట్‌ చేయండి

శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి ‘దిశ’ చట్టం తీసుకు వచ్చారు. 21 రోజుల్లో బాధితులకు న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కర్నూలులో జరిగిన సంఘటనపై చంద్రబాబు పవన్‌ నిలదీయాలి. హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదు. ఇప్పటికే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని కలిశాం. పవన్‌ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరాం. పవన్‌ కల్యాణ్‌ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. బాలిక పేరు చెప్పుకుని ఆయన కర్నూలులో అడుగుపెట్టారు. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న పవన్‌కు సీమలో అడుగుపెట్టే అర్హత లేదు’ అని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top