ఆయన అహంభావి.. ఈయనో బఫూన్‌ : రోషన్‌ బేగ్‌

KA Congress Leader Roshan Baig Slams Own Party After Exit Poll Results - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ 20 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందంటూ ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రోషన్‌ బేగ్‌ రాష్ట్ర నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీట్ల కేటాయింపు విషయంలో మైనార్టీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పోర్టుఫోలియోలను అమ్ముకున్నారని సొంతపార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ బఫూన్‌ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మంగళవారం రోషన్‌ బేగ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘  సిద్ధరామయ్య అహంభావి. కేసీ వేణుగోపాల్‌ బఫూన్‌. వీరితో పాటు గుండు రావు ఫ్లాప్‌ షో కారణంగా ఫలితాలు ఇలా వచ్చాయి. ఈ విషయంలో రాహుల్‌ గాంధీని క్షమాపణలు కోరుతున్నా. క్రిస్టియన్లకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. ముస్లింలకు ఒకే ఒక్క సీటు కేటాయించారు. ఈ విషయం గురించి సీఎం కుమారస్వామిని ఎలా నిందించగలం. ప్రభుత్వాన్ని నడిపే అధికారం కోల్పోవాల్సి వస్తుందని ఆయన భయం. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానంటూ సిద్ధరామయ్య చెప్పుకుంటూనే ఉన్నారు. పోర్టుఫోలియోలను అమ్ముకున్నారు’ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కాగా బేగ్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ నేత జి. పరమేశ్వర స్పందించారు. ఇది పూర్తిగా బేగ్‌ వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆయన ఆశించిన బెంగళూరు టికెట్‌ దక్కకపోవడంతో ఈవిధంగా మాట్లాడుతున్నారన్నారు. సీనియర్‌ నేత అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని పేర్కొన్నారు.

ఇక ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో భాగంగా కర్ణాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాలు గెలుచుకుంటుందని టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ వెల్లడించింది. ఇక్కడ బీజేపీ ఓటింగ్‌ శాతం 43 నుంచి 48.5 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి గట్టి షాక్‌ తగలనుందని.. ఈ కూటమికి 2014లో 11 స్ధానాలు దక్కగా ఇప్పుడు ఏడు స్ధానాలు మాత్రమే లభించనున్నాయని అభిప్రాయపడింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top