కాంగ్రెస్‌లోకి గద్దర్‌ కుమారుడు | Gaddars son into Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి గద్దర్‌ కుమారుడు

Apr 25 2018 12:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

Gaddars son into Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ కుమారుడు జి.వి. సూర్యకిరణ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని సూర్యకిరణ్‌...నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న సూర్యకిరణ్‌ గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో తెరవెనుక పాత్ర పోషించారు.

వ్యక్తిగత పరిచయాల నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సి.కనకారెడ్డి గెలుపు కోసం, 2016 పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్‌.రామచందర్‌రావు గెలుపు కోసం ఆయన పనిచేశారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సూర్యకిరణ్‌...రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కంటోన్మెంట్‌ అసెంబ్లీపై ఆయన దృష్టి పెట్టారని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే బెల్లంపల్లి, జుక్కల్‌ స్థానాల నుంచి కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న సందర్భంగా సూర్యకిరణ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశం తనకు ప్రధానం కాదని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పారు.

విప్లవ నేత కుమారుడినే అయినా రాజకీయాల విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు తనకుందన్నారు. తన రాజకీయ నిర్ణయానికి, తండ్రి గద్దర్‌కు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి, వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌లు కూడా బుధవారం రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.


రాష్ట్ర నేతలను రావొద్దన్న అధిష్టానం...
కాంగ్రెస్‌లోకి సూర్యకిరణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ల చేరికల కార్యక్రమానికి టీపీసీసీ నేతలు ఎవరూ రావద్దని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేవలం పార్టీలో చేరే నేతలు, వారి వెంట ఒకరిద్దరు ముఖ్య అనుచరులు మాత్రమే ఢిల్లీ వెళ్తారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్‌ ఆదేశాల మేరకే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా బుధవారం ఢిల్లీ వెళ్లడం లేదని తెలియవచ్చింది. అయితే నాగంతోపాటు వేములవాడ నేత ఆదిశ్రీనివాస్‌ల చేరికలను స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం విభేదిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు వెళ్లి మరికొందరు వెళ్లకపోతే అది వివాదాలకు దారి తీస్తుందని, ఎవరూ వెళ్లకుండా ఉంటే ఆ చేరికలను ఎవరూ వ్యతిరేకించే అవకాశం ఉండదనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement