65 స్థానాల్లో ఓకే

congress to sweep south telangana, says uttamkumar reddy - Sakshi

     వచ్చే ఎన్నికల అభ్యర్థులపై ఉత్తమ్‌  

     ఫిబ్రవరి రెండో వారంలో బస్సు యాత్ర 

     యాత్ర మధ్యలో రాహుల్‌ బహిరంగ సభ 

     నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల యోచన 

     షరతుల్లేని చేరికలకు ఓకేనని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో 60–65 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశముందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించినట్లే అనిపిస్తోందన్నారు. పార్టీ సంస్థాగత, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పలు అంశాల ను సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రియాశీలకంగా ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులను కొనసాగిస్తామని.. అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నేతల స్థానంలో ఉత్సాహవంతులకు అవకాశమిస్తామన్నారు. ప్రస్తు తం 10 జిల్లాల డీసీసీ అధ్యక్షుల పనితీరు సంతృప్తిగానే ఉందని తెలిపారు. కేంద్రంతోపాటు టీఆర్‌ఎస్‌ కూడా 31 జిల్లాలను గుర్తించినట్లు లేదని.. కొత్త జిల్లాలకు అధ్యక్షులను టీఆర్‌ఎస్‌ నియమించలేదన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం ఆధారంగా పార్టీ నిర్మాణం ఉండేలా యోచిస్తున్నామని, ఇందుకు   నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను అధికారికంగా ప్రకటిస్తే సరిపోతుందని చెప్పారు.  

పవన్‌ యాత్రపై ఇప్పుడేమీ మాట్లాడలేం 
ఫిబ్రవరి రెండో వారంలో బస్సుయాత్ర చేస్తామని, ప్రతి నియోజకవర్గం పర్యటించేలా యాత్ర ఉంటుం దని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల రోజుల్లో యాత్రను ఆపుతామన్నారు. జూన్‌ 2న బహిరంగసభ నిర్వహించనున్నామని, యాత్ర మధ్యలోనూ రాహుల్‌ తో బహిరంగసభ ప్రతిపాదన ఉందన్నారు. కాంగ్రెస్‌ లో చేరేవారందరికీ ప్రాధాన్యం ఉంటుందని.. టికెట్ల హామీ ఇస్తే చేరుతామనే వారి విషయంలో పరిమితు లున్నాయన్నారు. పరిస్థితులు, ప్రాంతం ఆధారంగా టికెట్ల హామీ అందరికీ సాధ్యం కాదని.. అవకాశాలను బట్టి పార్టీలో పనిచేసే వారందరికీ ప్రాధాన్యం ఉంటుం దన్నారు. అనేక మంది టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తమకు టచ్‌లో ఉన్నారని, ఫిబ్రవరి రెండోపక్షంలో చేరికలు ఉంటాయని తెలిపారు. పవన్‌ యాత్రపై ఇప్పుడేమీ మాట్లాడలేమని, యాత్రలో మాట్లాడే అంశాలను బట్టి స్పందిస్తే బాగుంటుందని చెప్పారు.  

దక్షిణ తెలంగాణలో స్వీప్‌ చేస్తాం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులు పూర్తిగా విజయం సాధిస్తారని, రంగారెడ్డి జిల్లాలో 12 స్థానాలు కాంగ్రెస్‌వేనని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీడీపీ నేతలు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 31 రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎల్‌డీఎంఆర్‌సీ కార్యక్ర మంతో పార్టీని పటిష్టం చేశామన్నారు. జనరల్‌ నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం చేపడతామని చెప్పారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీలను సిద్ధం చేస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది నేతలతో సైన్యం సిద్ధమవుతోందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌.. కళ్లు నెత్తికెక్కి నియంతృత్వ, అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కుటుంబమే బంగారుమయం అయిందని.. దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top