బీజేపీలోకి రెబెల్‌ ఎమ్మెల్యే.. ఖర్గేపై పోటీకి సై!

Congress MLA Umesh Jadhav joins BJP - Sakshi

బెంగళూరు: రోజుల కిందట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన  కాంగ్రెస్‌ రెబెల్‌ నేత ఉమేశ్‌ జాదవ్‌ బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేపై ఉమేశ్‌ జాదవ్‌ను పోటీకి దింపే అవకాశముందని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. 

కలబురిగిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ సందర్భంగా బీజేపీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌, ఇతర పార్టీ నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టేవిధంగా కలబురిగి ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. 

కర్ణాటకలో ఓటమి ఎరుగని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన ఖర్గేపై బరిలోకి దింపేందుకే ఉమేశ్‌ జాదవ్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్టు కాషాయ వర్గాలు తెలిపాయి. గుల్బార్గా నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన ఖర్గే ఎన్నికల్లో ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అందుకే స్థానికంగా గట్టి పట్టున్న కాంగ్రెస్‌ రెబెల్‌ నేత ఉమేశ్‌ జాదవ్‌ను పార్టీలో చేర్చుకున్నట్టు బీజేపీ సీనియర్‌ నేతలు చెప్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top