కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఐదు గ్రూపులు

Congress Leaders Divided In 5 Groups To Pick Party Chief - Sakshi

ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. నేడు సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో రాష్ట్రాల నేతలతో పార్టీ అధిష్టానం విస్తృత సంప్రదింపులు అనంతరం ముగిసింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలతో పార్టీ పెద్దలు చర్చించారు. పార్టీ నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఏఐసీసీ అధ్యక్షుడిని ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని రాహుల్‌ గాంధీ నిర్దేశించారు. అలాగే నూతన అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కాబోమని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పారు. సమావేశం మధ్యలోనే వారద్దరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో పార్టీ పీసీసీలే కొత్త చీఫ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

ఐదు గ్రూపులు..
మరోవైపు ఈసారి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, ముఖ్యనేతలను ఐదు గ్రూపులుగా విభజించి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంప్రదింపులు జరపనున్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నేతలతో ప్రియాంక గాంధీ, పశ్చిమ రాష్ట్రాల నేతలతో రాహుల్‌ గాంధీ, తూర్పు రాష్ట్రాలతో సోనియాగాంధీ, ఈశాన్య రాష్ట్రాల నేతలతో అంబికా సోని సంప్రదింపులు జరిపి ఓ అభిప్రాయానికి రానున్నారు. కేవలం సీడబ్ల్యూసీ  నేతలతోనే కాకుండా రాష్ట్ర నేతలతో కూడా సంప్రదింపులు జరిపి కొత్త అధ్యక్షుడి ఎంపిక చేయాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నూతన చీఫ్‌ ఎన్నికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

తొలుత తాత్కాలిక ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎన్నుకుని, ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు నిర్వహించేందుకు కొందరు సీనియర్లు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్‌ వాస్నిక్‌. మరోవైపు పార్టీ యువ నేతలు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌ ఫైలెట్లు కూడా రేసులో ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top