కర్ణాటకలో శాఖలపై కాక!

Congress, JDS cabinet stalemate continues as both eye finance ministry - Sakshi

మంత్రిత్వ శాఖల కోసం కాంగ్రెస్, జేడీఎస్‌ పట్టు

కొలిక్కిరాని కర్ణాటకం

ఆదివారం రాహుల్‌ వచ్చాకే ముందడుగు!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ పార్టీ ఎటూ తేల్చుకోలేపోతోంది. అధిష్టానం కాంగ్రెస్‌ శాసనసభ పక్షం నుంచి  ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిప్యూటీ సీఎం పరమేశ్వర అధిష్టానంపైనే పూర్తి విశ్వాసం ఉంచగా సిద్దరామయ్య త్వరగా తేల్చాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆర్థిక శాఖ సహా కీలకమైన 4 శాఖలపై నిర్ణయం తీసుకోలేదు. రైతు రుణమాఫీ నేపథ్యంలో ఇది తనవద్దే ఉంచుకోవాలని సీఎం పట్టుబడుతుండగా..  తమకే కావాలని సిద్దరామయ్య ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పార్టీ ట్రబుల్‌ షూటర్‌ గులాంనబీ ఆజాద్‌ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారూ మంత్రి పదవుల కోసం పట్టుబట్టడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అటు కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్, సీఎం సోదరుడు రేవణ్ణలు పీడబ్ల్యూడీ శాఖ కావాలంటున్నారు. కాంగ్రెస్‌ పలు శాఖలపై ఒత్తిడి తెస్తుండటంతో సంకీర్ణంపై కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని బయటపెట్టేలా జేడీఎస్‌ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. కింది స్థాయిలో ఇరుపార్టీల్లోనూ అసంతృప్తి తారస్థాయిలో కనబడుతోంది. ఫలితాలు రాగానే బేషరతు మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్‌ ముందుకొచ్చిందని ఇప్పుడు కొర్రీలు పెట్టడం సరికాదంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాహుల్‌ గాంధీ విదేశాల నుంచి భారత్‌కు తిరిగొచ్చాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది.  

పుణ్యాత్ముడివల్లే అధికారం: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కుమారస్వామి పుణ్యాత్ముడితో పోల్చారు. ఆ పుణ్యా త్ముడి వల్లే అధికారంలోకి వచ్చానన్నారు. ‘ఈరోజు నాకు ప్రజల ఆశీస్సులు లేకున్నా పుణ్యాత్ముడు రాహుల్‌  నాపై నమ్మకం ఉంచడం వల్లే అధికారం దక్కింది. ఆయన్ని కూడా విశ్వాసంలోకి తీసుకునే ఓ నిర్ణయం తీసుకుంటా’ అని రైతులతో కుమారస్వామి అన్నారు. ప్రజా విశ్వాసం కాకుండా కాంగ్రెస్‌ దయాదాక్షిణ్యాలపైనే తాను ఆధారపడి ఉన్నానని గతంలో వ్యాఖ్యానించడంతో బీజేపీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top