ఆదిలో కాంగ్రెస్‌..ఆపై మజ్లిస్‌ | Congress And Majlis Parties in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆదిలో కాంగ్రెస్‌..ఆపై మజ్లిస్‌

Mar 16 2019 11:44 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress And Majlis Parties in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో  :చారిత్రక భాగ్యనగరిలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దాదాపు పాతనగరమంతా దీని పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో తొలుత ఇక్కడ కాంగ్రెస్‌ వరుస విజయాలు నమోదు చేయగా... ఆ తర్వాత ఎంఐఎం పుంజుకుంది. ఈ నియోజకవర్గం మజ్లిస్‌ కంచుకోటగా మారిపోయింది. ఇక ఇక్కడ పట్టుసాధించాలని బీజేపీ శతవిధాలాప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు.

కాంగ్రెస్‌ ఖతర్నాక్‌... 
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి సారథ్యం వహించిన కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పేరుతో బరిలోకి దిగగా కాంగ్రెస్‌తో తలపడలేకపోయింది. నిజాం జాగీరులో మంత్రిగా పని చేసిన అహ్మద్‌ మొహియుద్దీన్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించడంతో... ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మొహియుద్దీన్‌ ఓటమి చవిచూడక తప్పలేదు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో అహ్మద్‌ మొహియుద్దీన్‌ సికింద్రాబాద్‌ స్థానానికి మారగా... కాంగ్రెస్‌ అభ్యర్థిగా వినాయక్‌రావు విజయం సాధించారు. ఈయన తర్వాత బరిలోకి దిగిన గోపాల్‌ ఎస్‌ మెల్కొటే వరుసగా 1962, 1967లలో విజయదుందుభి మోగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 1971లో మెల్కొటే తెలంగాణ ప్రజా సమితి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ ఆ తర్వాత వరుసగా రెండుసార్లు 1977, 1980లలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. 1984 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పూర్తిగా వెనకబడిపోయింది. ఇక తర్వాత మళ్లీ కోలుకోలేదు.   

తిరుగులేని ఎంఐఎం... 
తొలుత పరాజయాలు ఎదుర్కొన్న మజ్లిస్‌ (ఎంఐఎం) ఆ తర్వాత పట్టు సాధించింది. ఆదిలో స్వతంత్ర అభ్యుర్థులుగా బరిలోకి దిగిన ఈ పార్టీ నేతలు ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చారు. 1962లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాహెద్‌ ఒవైసీ రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 1977లో సుల్తాన్‌ సలావుద్దీన్‌ స్వతంత్ర అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చినా... కాంగ్రెస్‌ చేతిలో పరాజయం తప్పలేదు. తర్వాత మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ను కూడా ఓడిపోయారు. 1984లో టీడీపీ ఆవిర్భావం మజ్లిస్‌కు కలిసొచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డిపై సలావుద్దీన్‌ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆరుసార్లు సలావుద్దీన్, మూడుసార్లు ఆయన తనయుడు అసదుద్దీన్‌ వరుసగా గెలుపొందారు.  

బీజేపీ పోరాటం...  
హిందూత్వ ఎజెండాతో బీజేపీ ప్రతి ఎన్నికలోనూ హేమాహేమీలను రంగంలోకి దింపినా విజయం మాత్రం దక్కడం లేదు. తొలిసారి 1980లో జనతా పార్టీ తరఫున ఆలె నరేంద్ర బరిలో నిలిచి కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం పొత్తుల్లో భాగంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆ తర్వాత 1991లో బీజేపీ తరఫున బద్దం బాల్‌రెడ్డి బరిలోకి దిగగా.. మజ్లిస్‌ చేతిలో ఓటమి తప్పలేదు. 1996లో వెంకయ్యనాయుడిని పోటీలో నిలిపినా విజయం వరించలేదు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు బద్దం బాల్‌రెడ్డి బరిలోకి దిగినా రెండో స్ధానానికే పరిమితమయ్యారు. తర్వాత సుభాష్‌ చంద్రాజీని బరిలో నిలపగా గత ఫలితాలే పునరావృతమయ్యాయి. 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభావం, స్థానికంగా టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని భావించిన బీజేపీ భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావును రంగంలోకి దింపగా ఆయనా ఓటమి పాలయ్యారు.  

టీడీపీ పరాభవం  
ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ మద్దతుతో పోటీ చేసింది. 1984లో కె.ప్రభాకర్‌రెడ్డి, 1989లో తీగల కృష్ణారెడ్డి పోటీలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత పట్లోళ్ల ఇంద్రారెడ్డి బరిలోకి దిగి మూడో స్థానానికే పరిమితమయ్యారు. 1996లో తిరిగి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా, ఆరో స్థానానికి పడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన సియాసత్‌ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జాహిద్‌ అలీఖాన్‌ గట్టి పోటీ ఇచ్చిన్పపటికీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ నామమాత్రంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement