రైతు చుట్టూ.. మేనిఫెస్టో 

Congress and BJP Manifesto Promises to Chhattisgarh Voters - Sakshi

     ఛత్తీస్‌గఢ్‌ ఓటర్లకు కాంగ్రెస్, బీజేపీ హామీలు 

     మహిళలు, యువతపై వరాల జల్లు  

హోరాహోరీగా సాగుతున్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మేనిఫెస్టోలు కూడా హాట్‌హాట్‌గానే ఉన్నాయి. ‘జన్‌ ఘోషణ్‌ పత్ర’ పేరుతో కాంగ్రెస్‌ (శుక్రవారం రాహుల్‌ విడుదల చేశారు), ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో శనివారం బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇరు పార్టీలు రైతులు, మహిళలు, విద్యారంగం, యువత తదితర ముఖ్యమైన అంశాల్లో రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తామంటూ హామీలు గుప్పించాయి. అయితే వీటికి అదనంగా బీజేపీ మావోయిస్టుల బెడదను తప్పిస్తామని భరోసా ఇచ్చింది. మావోలతో చర్చలు జరుపుతామని, మావోయిస్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్‌ పేర్కొంది. పేద కుటుంబాలకు కిలో రూపాయి చొప్పున ప్రతినెలా 35 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించింది. వర్గాల వారిగా రెండు పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలిస్తే..  

రైతులు: కాంగ్రెస్‌: రాష్ట్రంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయిన పది రోజుల్లోగా రైతుల అన్ని రకాల రుణాలు మాఫీ. స్వామినాథన్‌ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నిర్ణయం. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛను. 
బీజేపీ: వచ్చే ఐదేళ్లలో రైతులకు కొత్తగా 2 లక్షల పంపుసెట్‌ కనెక్షన్లు. 60 ఏళ్లు దాటిన భూమిలేని రైతులకు నెలకు వెయ్యి రూపాయలు పింఛను. పప్పులు, నూనెగింజలకు కనీస మద్దతు ధర. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను 1.5 శాతం పెంచడం. సేంద్రియ సాగుకు ప్రోత్సాహం. రాష్ట్రంలో 50% భూమిని సాగులోకి తెచ్చేలా ఆనకట్టల నిర్మాణం. 
మహిళలు: కాంగ్రెస్‌: మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల్ని కఠినంగా అమలు పరచడం. ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లు నెలకొల్పడం. ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా సహాయ కేంద్రాలు ఏర్పాటు. రాత్రివేళల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రత్యేక భత్యం. 
బీజేపీ: మహిళలు సొంత వ్యాపారాలు చేపట్టడం కోసం 2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు. 
యువత: కాంగ్రెస్‌: యువతకు అప్రెంటీస్‌షిప్‌ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు .రాజీవ్‌ మిత్ర యోజన కింద రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులకు నెలవారీ భృతి . 
బీజేపీ: కౌశల్‌ ఉన్నాయన్‌ యోజన కింద నిరుద్యోగులకు భృతి. 
విద్యార్థులు: కాంగ్రెస్‌: పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనతల నివారణపై ప్రత్యేక శ్రద్ధ. విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు. 
బీజేపీ: 12వ తరగతి వరకు పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా పంపిణీ.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు. 

ఇతర అంశాల విషయానికి వస్తే మావోయిస్టు దాడుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్‌ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో ఫిల్మ్‌సిటీ నిర్మాణం, జర్నలిస్టులకు సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు, ప్రజలకు 24 గంటలు ఉచిత విద్యుత్, తాగునీరు, పింఛనర్లకు వైద్యం కోసం వెయ్యి రూపాయల భత్యం వంటివి బీజేపీ మేనిఫెస్టోలో అదనపు హామీలు. విద్యుత్‌ చార్జీల తగ్గింపు, పేదలకు ఇళ్లు,మైనారిటీకు సంక్షేమ పథకాలు వంటివి రెండు పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ ఉన్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top