మాఫీ చేయకుంటే రాజీనామా

Committed to farm loan waiver, else will retire - Sakshi

రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నా: కుమారస్వామి

ప్రధానితో కుమారస్వామి భేటీ

మాఫీ కష్టమే: దేవెగౌడ

న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: రైతు రుణమాఫీకి తాను కట్టుబడి ఉన్నానని, అలా చేయని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పాను. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీపై సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అయితే కొన్ని పరిమితులున్నందున సమయం అవసరం’ అని పేర్కొన్నారు. రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించామని.. బుధవారం బెంగళూరులో వాటిని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, ప్రజలు వాటిని నమ్మొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

ప్రజలను అవమానించలేదు
కాంగ్రెస్‌ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని.. ప్రజల దయతో కాదంటూ తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. ప్రజలను అవమానించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. భాగస్వామ్య కూటమి కారణంగానే సీఎం అయ్యానని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘నేను సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాను. కాంగ్రెస్‌ మద్దతున్నన్ని రోజులు సీఎంగా ఉంటాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఆ విషయాన్నే చెప్పా. నా వ్యాఖ్యలను మీరెందుకు (మీడియా) వక్రీకరించారో అర్థం కావడం లేదు’ కుమారస్వామి పేర్కొన్నారు.   

కాంగ్రెస్సే సీఎం పదవి ఇచ్చింది: దేవెగౌడ
రైతు రుణమాఫీపై తామిచ్చిన హామీని నిలబెట్టుకోవడం కష్టమని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు.  బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వేరే పార్టీ మద్దతుతో మేం ప్రభుత్వాన్ని నడపాలి. వారి పథకాలను అమలు చేయాలి. వారి మద్దతు లేకుండా రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదు’ అని అన్నారు. కుమారస్వామికి కాంగ్రెస్‌ పార్టీ సీఎం పదవి ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీని తాను కోరానని.. అయితే కుమారస్వామి సీఎం అవ్వాలనేది తమ హైకమాండ్‌ నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌లు చెప్పారన్నారు.   

శాఖలపై తేలని చర్చలు
ఐదురోజులుగా మంత్రిత్వ శాఖల పంపకాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్య జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతుండటంతోనే ఎటూ తేలడం లేదు. రాహుల్, సోనియాలు విదేశాలకు వెళ్లడంతో సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్,  గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో కుమారస్వామి, జేడీఎస్‌ నేత డానిష్‌ అలీ చర్చలు జరిపారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలతో కుమారస్వామి చర్చలు జరిపారని.. త్వరలోనే ఈ విషయం పరిష్కారం అవుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేయాలని సోమవారం ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన రాష్ట్ర బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రజల్నుంచి పెద్దగా స్పందన లభించలేదు.

రాష్ట్రంలో బొగ్గు కొరత తీర్చాలని ప్రధానిని కోరా
కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కుమార స్వామి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు కొరతపై మోదీతో చర్చించారు. ‘రాయ్‌చూర్, యరమర, బళ్లారి ప్లాంట్లకు డిమాండ్‌ మేరకు బొగ్గును సరఫరా చేయాలని ప్రధానిని కోరాను. ఇతర సమస్యలపై కూడా చర్చించాం. ఈ సందర్భంగా సీఎంగా, పీఎంగా తన పాలనా అనుభవాల్ని ప్రధాని నాతో పంచుకున్నారు’ అని కుమార స్వామి చెప్పారు.   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top