చంద్రబాబు, పవన్‌ భేటీ

Chandrababu and Pawan meeting - Sakshi

అరగంట పాటు సమావేశం

నంబూరు వద్ద ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు 

ఇద్దరికీ స్వాగతం పలికిన లింగమనేని రమేష్‌

పెదకాకాని (పొన్నూరు): కొన్నాళ్లుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్లు కనిపించిన సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తాజాగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామ పరిధిలోని లింగమనేని టౌన్‌షిప్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన లింగమనేని రమేష్‌ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ ఒక గదిలో కొద్దిసేపు భేటీ కావడం గమనార్హం. పవన్‌ ఇటీవల టీడీపీపై విమర్శలకు దిగటంతో వారి మధ్య కొంతకాలంగా దూరం పెరిగిందని భావిస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోగా రోజుకో మాట మాట్లాడుతున్నారని, నారా లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల తీవ్ర విమర్శలు చేయటం తెలిసిందే. 

భేటీకి సూత్రధారి లింగమనేని
సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల భేటీకి లింగమనేని రమేష్‌ను సూత్రధారిగా భావిస్తున్నారు. కృష్ణా కరకట్ట వెంట ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివసిస్తున్న భవనం లింగమనేని రమేష్‌కు చెందినదే కావటం గమనార్హం. నదీ తీరాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. రాజధానికి భూ సమీకరణ సమయంలో కూడా లింగమనేని కుటుంబానికి చెందిన భూములు పూలింగ్‌ పరిధిలోకి రాకుండా అలైన్‌మెంట్‌ను నిర్ణయించారు. రాజధానిలోని కంతేరు వద్ద లింగమనేనికి సంబంధించిన వ్యక్తుల నుంచి హెరిటేజ్‌ కంపెనీ 14 ఎకరాలను చౌకగా కొనుగోలు చేసింది. మరోవైపు మంగళగిరి సమీపంలో పవన్‌ కల్యాణ్‌ నిర్మిస్తున్న భవనం కోసం విలువైన స్థలాన్ని కూడా లింగమనేని రమేష్‌ చౌకగా సమకూర్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ప్రత్యేక పూజల్లో పవన్, చంద్రబాబు 
ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ఉదయం 10:30 గంటలకు రాగా అనంతరం చంద్రబాబు 11:05 గంటల సమయంలో వచ్చారు. వారిద్దరికీ ఆలయ నిర్వాహకుడైన లింగమనేని రమేష్‌ ఆహ్వానం పలికారు. ముందుగా పవన్‌కల్యాణ్‌ స్వామికి నూతన వస్త్రాలు సమర్పించారు. అర్చకుల వేదమంత్రాల నడుమ సీఎం చంద్రబాబు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తరువాత ఇద్దరు నేతలు స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఏసీ గదిలో చంద్రబాబు, పవన్‌ సుమారు 25 నిమిషాల పాటు సమావేశమైనట్లు సమాచారం. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:06 గంటలకు, పవన్‌ కల్యాణ్‌ 2:20 గంటల సమయంలో మీడియాతో  మాట్లాడకుండా వెళ్లిపోయారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నారాయణ, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top