వారి గుండెల్లో బులెట్లు దింపాలి

Central Forces Will Answer To TMC Workers With Bullets - Sakshi

టీఎంసీ కార్యకర్తలకు బదులివ్వండి

బెంగాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి

కోల్‌కత్తా: ఆరోవిడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మే 19న జరిగే చివరి దశ పోలింగ్‌ ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే బీజేపీ సారథి అమిత్‌ షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అమిత్‌ షా సోమవారం బెంగాల్‌లో పర్యటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బసిర్హట్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాయంతన్‌ బసు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. చివరి దశ ఎన్నికల్లో తృణమూల్‌ కార్యకర్తలు ఆందోళలకు ప్రయత్నిస్తే భద్రతా సిబ్బంది వారికి తూటాలతో బదులివ్వాలని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడుతున్న టీఎంసీ కార్యకర్తల గుండెల్లో బులెట్లు దింపి వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వారి దాడులను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలతో తాను మాట్లాడుతానని, వారు సక్రమంగా విధులు నిర్వర్తించపోతే బీజేపీ కార్యకర్తలే వారి పనిపట్టాలని అన్నారు.  ప్రముఖ బెంగాలీ నటి, నస్రత్ జహాన్‌ను ఇక్కడి నుంచి టీఎంసీ బరిలో నిలిపింది.

బీజేపీ నేత భారతిపై దాడి..
పశ్చిమబెంగాల్‌లోని 8 లోక్‌ సభ సీట్లకు పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఘటాల్‌ నియోజకవర్గంలోని కేశ్‌పూర్‌ ప్రాంతంలో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్‌ అధికారిణి భారతీ ఘోష్‌పై టీఎంసీకి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top