‘రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా’ | Botsa Satyanarayana Slams Chandrababu Over Comments On CM Jagan | Sakshi
Sakshi News home page

‘రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా’

Oct 23 2019 7:44 PM | Updated on Oct 23 2019 7:59 PM

Botsa Satyanarayana Slams Chandrababu Over Comments On CM Jagan - Sakshi

రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. అమరావతిలో పునాదులు తీయాలంటే 100 అడుగులు తవ్వాలి.

సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో చంద్రబాబు చేపట్టినవన్నీ తాత్కాలిక నిర్మాణాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలు అధికారమిచ్చిన ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆయన వ్యాఖ్యలు చూస్తే అనుభవమున్న నాయకత్వ లక్షణాలు ఏ ఒక్కటి కనిపించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. ఆత్మస్తుతి, పరనింద తప్పా చంద్రబాబులో పరివర్తన కనిపించడం లేదని చురకలంటించారు. బుధవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. 

‘రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచారు. చంద్రబాబు అదనంగా రూ.లక్షా 65 వేల కోట్ల అప్పులు చేశారు. వ్యక్తిగత అవసరాలకోసం వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల పాలనాకాలంలో అమరావతిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు. మీరు కట్టిన రాజధానిని ఎవరైనా ఎత్తుకుపోయారా. రాజధాని గ్రాఫిక్స్‌ తప్ప బాబు చేసింది శూన్యం. మీ హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేసి, మీ చుట్టాలు, తాబేదార్లు దోచుకున్నది వాస్తవం కాదా. బాబు తన వియ్యంకుడికి రాజధాని పక్కన 500 ఎకరాలు కట్టబెట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం. అమరావతిలో పునాదులు తీయాలంటే 100 అడుగులు తవ్వాలి. అవినీతి, దోపిడీకి తావులేకుండా మంచి రాజధాని నిర్మిస్తాం. రాష్ట్ర రాజధాని దేశంలో మేటి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 5 కోట్ల ప్రజలు హర్షించే రీతిలో రాజధాని కట్టి తీరుతాం.

రాజధానిపై ప్రభుత్వం వేసిన కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల మనోభావాలను స్వీకరిస్తుంది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను కమిటీ పరిగణిస్తుంది. ఆరు వారాల్లో కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత సుదీర్ఘ చర్చ జరుగుతుంది. నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తాం. కన్ఫ్యూజన్‌ ఉన్నది చంద్రబాబు, లోకేశ్‌కే. సీఎం వైఎస్ జగన్‌ను చంద్రబాబు ఏకవచనంతో సంభోధించడం.. ఎవరిచ్చిన అధికారం? చంద్రబాబుకు ఇంకా మైండ్‌ సెట్‌ మారలేదు. మీ ఆలోచన విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాట్లాడే విధానం మార్చుకోవాలి’అని బొత్స అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement