బాబు తప్పులను సరిచేస్తున్నాం  | Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు తప్పులను సరిచేస్తున్నాం 

Jan 5 2020 4:42 AM | Updated on Jan 5 2020 4:42 AM

Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన

సాక్షి, తిరుపతి/ తిరుపతి రూరల్‌: ‘చంద్రబాబు రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఆయన మాయలో పడొద్దు. పాలనా వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణన్‌ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. బీసీజీ (బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) కమిటీ సలహాలను నీతి ఆయోగ్‌ కూడా తీసుకుంది. అమరావతి ఎక్కడికీ పోదు. అమరావతిని విద్యా కేంద్రంగా మార్చాలని బీసీజీ నివేదిక ఇచ్చింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవినీతి, స్వార్థ రాజకీయాలతో చంద్రబాబు చరిత్రహీనుడుగా నిలిచిపోయారు. అన్ని ప్రాంతాల అభివృద్దిని విస్మరించారు. ఆయన చేసిన తప్పులను మేం సరి చేస్తున్నాం’ అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం రాత్రి తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుపతి, చిత్తూరు ఎంపీలు బల్లి దుర్గాప్రసాద్‌రావు, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ...

మరి రూ. 52 వేల కోట్లకు టెండర్లెందుకు?
‘రాజధానిపై శివరామకృష్ణన్‌ ఇచ్చిన నివేదికపై సైతం చంద్రబాబు మభ్యపుచ్చే యత్నం చేస్తున్నారు. అంతర్జాలంలో కమిటీ నివేదిక అందుబాటులో ఉంది. మూడు పంటలు పండే పొలాలున్న అమరావతిలో భవనాలు వద్దని, పాలనా వికేంద్రీకరణ ఉండాలని కమిటీ సూచించింది. చంద్రబాబు తొలుత ఏ నగర జనాభా ఎంతో తెలుసుకోవాలి. అమరావతిలో 29 గ్రామాల జనాభా అంతా కలిపితే లక్ష లోపే ఉంటుంది. అక్కడ భవనాలు కట్టేందుకు 130 అడుగుల వరకు పునాది తీయాలి. అమరావతి ప్రాంతం బంగారు పంటలు పండే స్థలం. రాజధాని కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశానని, ఇంకా రూ.3 వేల కోట్లు వెచ్చిస్తే చాలని చంద్రబాబు అంటున్నారు. మరి రూ.52 వేల కోట్ల పనులకు గతంలో ఎందుకు టెండర్లు పిలిచారు? రోడ్లు వేసేందుకు రూ.19,767 కోట్లు, లే అవుట్ల అభివృద్దికి రూ.17,910 కోట్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం రూ.11,752 కోట్లతో టెండర్లు పిలిచారు. కేవలం రూ.5,431 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో కూడా రూ.1,500 కోట్లు కేంద్రం ఇచ్చింది. గత ప్రభుత్వం పిలిచిన టెండర్ల ప్రకారం ఇంకా రూ.47 వేల కోట్లు కేవలం రాజధాని నిర్మాణానికే కావాలి’ బొత్స అన్నారు.

బీసీజీ ప్రముఖ సంస్థ
మాజీ మంత్రి నారాయణ ఏ రంగంలో నిపుణుడని ఆయన సారథ్యంలో గతంలో కమిటీని నియమించారు? తాజాగా నివేదిక ఇచ్చిన బీసీజీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న సంస్థ. గత ప్రభుత్వం కూడా బీసీజీ సిఫారసులు, సలహాలు తీసుకుంది. వాళ్లకు అనుకూలంగా ఇస్తే మంచివాళ్లా? లేదంటే అవినీతిపరులా?

చెప్పేవి నీతులు.. చేసేది అవినీతి
చంద్రబాబు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ అవినీతి పనులు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్‌సీపీకి అధికారాన్ని ఇచ్చారు. ఒక్క నగరాన్ని నిర్మించేందుకు రూ.3 లక్షల కోట్లు వెచ్చించగలమా? పోలవరం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయవద్దా? కడప ఉక్కు పరిశ్రమను నిర్మించుకోవద్దా?’  అని బొత్స ప్రశ్నించారు.

పవన్‌పై బొత్స మండిపాటు
పవన్‌ కల్యాణ్‌ రోజూ ఘీంకారాలు చేస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కాన్వాయ్‌ వెళ్తుంటే ఏ అధికారం ఉందని ఆపుతారు? రెండుచోట్ల ఓటమి పాలైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం’ అని బొత్స పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement