తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా

Published Fri, May 31 2019 1:43 AM

BJP Is Alternative ToTRS Kishan Reddy Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జి. కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిగా గురువారం ఢిల్లీలో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారిగా నలుగురు బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించినందుకు ప్రధాని మోదీ తరఫున, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తరఫున తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా నన్ను సికింద్రాబాద్‌ నుంచి గెలిపించిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నా. కేంద్ర మంత్రిగా నాకు మోదీ ఇచ్చిన బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఒక తెలుగువాడిగా రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు కలిగేలా కేంద్రం తీసుకొనే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తా. ప్రమాణస్వీకారం కంటే ముందు మోదీ మాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో విశ్వాసంతో పెద్ద బాధ్యత ఇచ్చారు.

వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైన∙ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. వచ్చే వారంలో ప్రారంభం కానున్న 17వ పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర మంత్రివర్గంలో కొత్త వాళ్లకు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు స్థానం కల్పించారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యమిచ్చి సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. పార్టీని విస్తరిస్తాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్‌ పార్టీ స్థానాన్ని తెలంగాణలో బీజేపీ భర్తీ చేసింది. అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

‘అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ఐదేళ్లలో కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను, పథకాలను దారి మళ్లించి ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణకు మరిన్ని పథకాలు, నిధులు వస్తాయని భావించి ప్రజలు తమను గెలిపించారన్నారు. ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తామని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement