కాయ్‌ రాజా కాయ్‌ 

Betting in Key Positions of Political Leaders - Sakshi

కీలక నేతల స్థానాల్లో బెట్టింగ్‌ల జోరు

కొన్ని చోట్ల గెలుపుపై.. మరికొన్ని చోట్ల మెజారిటీపై కోట్ల రూపాయల్లో దందా...

ఢీఅంటే ఢీ.. అంటున్న దిగ్గజాలపై, పోటాపోటీగా.. తలపడుతున్న ఉద్దండులపై, నువ్వా, నేనా.. అన్నట్లుగా సాగుతున్న బలమైన నేతలపై, హోరాహోరీగా.. ప్రచారంలో దూసుకుపోతున్న హేమాహేమీలపై, రికార్డు విజయాలతో జోరుమీదున్న గెలుపువీరులపై బెట్టింగ్‌లు జోరుగా, భారీగా సాగుతున్నాయి. అభ్యర్థులు సై అంటే సై అంటుంటే, వారి అనుచరులు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. ఎన్నికల రణరంగంలో ఉత్కంఠ పెరుగుతున్నకొద్దీ బెట్టింగ్‌లు తారాస్థాయి చేరుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీ నేతలను ఉత్కంఠకు గురి చేస్తుంటే అనుచరులు మాత్రం పోటా పోటీగా తమ నేతలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. గెలుపు తమదంటే తమదేనని కోట్ల రూపాయల్లో కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులపై కూడా బెట్టింగులు జోరందుకున్నట్టు పోలీస్‌ అధికారులు గుర్తించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.    
– సాక్షి, హైదరాబాద్‌

ఈ సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం
నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. వరుసగా ఎనిమిదోసారి గెలిచేందుకు జానారెడ్డి వ్యూహాలు రచిస్తుంటే, ఆయన విజయపరంపరకు అడ్డుకట్ట వేయగలనని నర్సింహయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనితో వీరి గెలుపుపై రూ.కోట్లలో బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.  
హుజూర్‌నగర్‌: ఇక్కడ బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నారై సైదిరెడ్డి మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న సైదిరెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గట్టిపోటీ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో బెట్టింగ్‌ రాయుళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.  

నల్లగొండ: ఐదోసారి గెలిచి మరోసారి సత్తా చాటుకో
వాలని సీనియర్‌ నేత కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ హాట్‌సీటుపైనా రూ.2 కోట్ల మేర బెట్టింగ్‌లు కడుతున్నట్టు నల్లగొండ జిల్లా కేంద్రంలో చర్చ నడుస్తోంది. 

కొడంగల్‌: రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మధ్య నెలకొన్న పోటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్థానంపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనితో దాదాపు రూ.5 కోట్ల వరకు ఇరు పార్టీల నేతల బెట్టింగ్‌ కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గద్వాల: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణకు ఆమె మేనల్లుడు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా బెట్టింగ్‌లు మాత్రం ఇరువైపులా భారీస్థాయిలో జరుగుతున్నాయి. కర్నూల్‌ ప్రాంతం నుంచి కూడా వీరిద్దరిపై భారీస్థాయిలో బెట్టింగులు పెట్టినట్టు తెలుస్తోంది.

జగిత్యాల: జగిత్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేపైనా బెట్టింగ్‌ కాస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ మధ్య పోరు ఉధృతంగా ఉంది. టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ఎంపీ కవిత శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ జిల్లాలో గెలిచిన ఏకైక సీటు జగిత్యాల. ఈ ఇద్దరు అభ్యర్థులపై లక్షల్లో బెట్టింగ్‌ కాస్తున్నారు. 

మంథని: మాజీమంత్రి శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ మధ్య పోరు నువ్వా నేనా.. అన్న స్థాయి లో ఉంది. ఎవరు గెలుస్తారన్నదానిపై అనుచరుల్లో ఉత్కంఠ రేకెత్తి స్తోంది. దీన్ని బెట్టింగ్‌ రాయుళ్లు అదునుగా చేసుకొని రూ.లక్షలు  పందెం కాస్తున్నట్టు తెలిసింది.  

రామగుండం: సింగరేణి ప్రాంతంలోని రామగుండం అసెంబ్లీ స్థానంపై పందెం ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కోరుకంటి చందర్‌ ఈసారి ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్, మక్కాన్‌సింగ్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. వీరి గెలుపుపై సింగరేణి, ఎన్టీపీసీ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో బెట్టింగ్‌ ముఠాలు భారీస్థాయిలో కాయ్‌ రాజా కాయ్‌ దందాకు తెరలేపాయి. 

కరీంనగర్‌: ఈ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్‌ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్‌ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంపై జిల్లాలో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. అభ్యర్థుల అనుచరులు కూడా భారీగా బెట్టింగులు కడుతున్నట్టు తెలిసింది.  

ఖమ్మం: ఈ అసెంబ్లీ బరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, నామా నాగేశ్వర్‌రావు తలపడుతున్నారు. వీరిద్దరూ వ్యాపారప్రముఖులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ స్థానం ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరిపై బెట్టింగులు భారీ స్థాయిలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

సనత్‌నగర్, శేరిలింగంపల్లి: ఈ స్థానాలపై కూడా జోరుగా బెట్టింగ్‌ జరుగుతోంది. ఈ స్థానాల్లో క్రితంసారి టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరికెపూడి గాంధీలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం వీరు టీఆర్‌ఎస్‌ తర ఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థానాల్లో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top