కోడెల రాజకీయ చరిత్ర అంతా దౌర్జన్యాలే! 

Ambati Rambabu Comments On Kodela Politics - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 

సాక్షి, అమరావతి: స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రాజకీయ చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ నిర్వహించిన ఎన్నికల్లో కోడెలపై ఎవరూ దాడి చేయలేదని, ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలోకి దౌర్జన్యంగా చొరబడి రిగ్గింగ్‌ చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఆయనే బెదిరించారని విమర్శించారు. దీంతో అక్కడి ప్రజలు రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు రియాక్ట్‌ అయ్యారని చెప్పారు. వెంటనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రామస్తులే తనపై దాడికి పాల్పడినట్లు చిత్రీకరించి వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని అంబటి విమర్శించారు. 

ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగితే 
టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయి? : ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని చంద్రబాబు ఒక వైపు ఆరోపిస్తూనే..మరో వైపు టీడీపీకి 150 సీట్లు వస్తాయని చెబుతున్నారని, అప్పుడు అన్ని సీట్లు ఎలా వస్తాయని అంబటి ప్రశ్నించారు. ఓటమి ఖాయమని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్నికల నిర్వహణపై  ఆశ్చర్యకరంగా మాట్లాడటం విడ్డూరమని చెప్పారు.   

23న తెలిసిపోతుంది..: మే 23వ తేదీన ప్రజా బ్యాలెట్‌లో ఎవరి బలం ఎంతో తెలుస్తుందని అంబటి అన్నారు. ఓడిపోయిన తరువాతనైనా కోడెల శివప్రసాదరావు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నరసరావు పేటలోనూ తాను చెప్పిందే జరగాలనే ఉద్దేశంతో 2014లో పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ తరఫున నరసరావుపేటలో పోటీ చేసిన నల్లబోతు వెంకట్రావును చిత్తుచిత్తుగా ఓడించాడని తెలిపారు. కోడెల అబ్బాయి, అమ్మాయిలకు పెత్తనం కావాల్సి ఉన్నందున..ఇప్పుడేమో టీడీపీ అభ్యర్థి అరవిందబాబును సైతం ఓడించబోతున్నారని అంబటి విమర్శించారు. 

కమీషన్లు దండుకోవడానికే పోలవరంపై సమీక్ష.. : ఎన్నికల కోడ్‌ ఉన్నా పట్టించుకోకుండా కమీషన్లు దండుకోవడానికే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు  రివ్యూలు చేస్తున్నారని అంబటి తెలిపారు. ‘జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలలు  బతికిందట. జగన్‌ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్షనేతగా నెట్టుకొచ్చాడని వ్యంగ్యంగా లోకేష్‌ ట్వీట్‌ చేశారంట. ట్వీట్‌లో పేర్కొన్నట్లు కోడికి తలకాయలేదోమో తెలియదు కాని లోకేష్‌కు మాత్రం బుర్ర లేదని అర్థం అవుతోంది’ అని అంబటి ధ్వజమెత్తారు. 

ఓట్ల దొంగ కోడెల.. :  ఓట్ల దొంగ కోడెల శివప్రసాదరావు చాలా ఆవేశంగా మాట్లాడారని, ఇనిమెట్ల పోలింగ్‌ కేంద్రంలోకి ఆయన వెళ్లి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని బెదిరించి రిగ్గింగ్‌ చేయాలనుకున్నారని అంబటి విమర్శించారు. ఘటనపై తాము  ఫిర్యాదు చేస్తే దాన్ని తీసుకోవడానికి కూడా పోలీసులు ముందుకు రాకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆధారాలతో సహా వెళ్లి ఎస్పీని కలిసి ప్రశ్నిస్తే అతికష్టం మీద కోడెలపై మంగళవారం కేసు నమోదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేయడంతో ఉక్రోషంతో చాలా ఆవేశంగా.. అహంకార పూరితంగా కోడెల మాట్లాడారన్నారు. ‘వైఎస్‌ జగన్‌ చంద్రబాబుకు పోటీనా.. నాకు అంబటి రాంబాబు పోటీనా’ అని మాట్లాడారని,  తన మీద గత ఎన్నికల్లో పోటీ చేసిన కోడెలకు కేవలం 924 ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చిందన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top