వెనక్కితగ్గం

We not move back an inch on CAA even if all parties unite against it - Sakshi

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై హోం మంత్రి అమిత్‌ షా స్పష్టీకరణ

మా బాటలోనే నడవండి: 11 రాష్ట్రాల సీఎంలకు కేరళ సీఎం విజయన్‌ లేఖలు

జోథ్‌పూర్‌/సిలిగురి/తిరువనంతపురం: పౌర సత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ప్రదర్శన లు దేశ వ్యాప్తంగా ఒక వైపు కొనసాగుతుండగా.. ఈ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం అంగుళం కూడా వెనకడుగు వేయబోదని హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ విషయం లో ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తరచూ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తున్న ప్రధాని మోదీ భారత్‌ ప్రతినిధా లేక పాకిస్తాన్‌ రాయబారినా అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. సీఏఏ అమలు నిలిపి వేయాలంటూ తమ మాదిరిగానే అసెంబ్లీల్లో తీర్మానం చేయాలంటూ బీజేపీయేతర 11 మంది సీఎంలకు రాసిన లేఖలో కేరళ సీఎం విజయన్‌ కోరారు. హిందుత్వ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ఆరోపించారు.

అందుకే సీఏఏపై అవగాహన కల్పిస్తున్నాం
సీఏఏ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా స్పష్టం చేశారు. రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌లో అమిత్‌ షా సీఏఏపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిపక్షాలు సీఏఏపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మూడు కోట్ల మంది ప్రజలకు చేరేలా 500 ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 5వ తేదీ నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు బీజేపీ తెలిపింది.

బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు
ప్రజాస్వామ్యం, లౌకికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ కేరళ సీఎం పినరయి విజ యన్‌ వివిధ రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. అందరూ ఐక్యంగా ఉండి మన దేశ ప్రజాస్వామిక, లౌకిక విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ బెంగాల్, ఢిల్లీ తదితర 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘సీఏఏ’ పై సుప్రీంలో మరో పిటిషన్‌
సీఏఏ వల్ల పౌరులు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

మనకు పాక్‌తో పోలికా?
ఘనమైన చరిత్ర, వారసత్వ సంపద కలిగిన మన దేశాన్ని పాకిస్తాన్‌తో పోల్చు తున్న ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన హిందుస్తాన్‌ ప్రతినిధా లేక పొరుగుదేశం ప్రతినిధా అని ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా సిలిగురిలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు పౌరసత్వం నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

‘ఘన చరిత్ర వారసత్వ సంపద కలిగిన విశాల దేశం భారత్‌. మోదీజీ మన దేశాన్ని పాకిస్తాన్‌తో ఎందుకు పోల్చుతున్నట్లు? మీరు భారత్‌ ప్రతినిధా లేక పాకిస్తాన్‌కా. ప్రతి సందర్భం లోనూ భారత్‌ను కాకుండా పాకిస్తాన్‌ ప్రస్తా వన ఎందుకు తెస్తున్నారు? మేం హిందుస్తా న్‌ను ప్రేమిస్తున్నాం. పాకిస్తాన్‌ మాదిరిగా ఉండాలనుకోవడం లేదు’ అని ఆమె వ్యాఖ్యా నించారు. దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ నేతలు పాకిస్తాన్‌ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top