
ఎలక్టోరల్ బాండ్లపై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు నిధుల కోసం జారీ చేసే ఎలక్టోరల్ బాండ్ల పధకం చట్టబద్ధతపై సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను విన్న సుప్రీం కోర్టు నేడు తన తీర్పును వెల్లడించనుంది. రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు పారదర్శక ప్రత్యామ్నాయాలు ఉండాలని లేదా ఎలక్టోరల్ బాండ్లను అనుమతించడంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుచేసేవారి పేర్లను గోప్యంగా ఉంచితే ఎన్నికల్లో బ్లాక్‌మనీని నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు వృధా అవుతాయని గురువారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్ల పధకాన్ని సవాల్ చేస్తూ ఓ ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని పిటిషనర్ కోరారు. ఎన్నికల్లో నల్లధనాన్ని నియంత్రించేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఉపకరిస్తాయని కేంద్రం సమర్ధించింది. ఎన్నికల తర్వాతే వీటి పనితీరుపై సమీక్షించాలని, ఈ దశలో ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జోక్యం చేసుకోరాదని కేంద్రం కోర్టును కోరింది.