పటాకుల అమ్మకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Supreme Court Bans Sale Of Fire Crackers In Delhi, NCR Region | Sakshi
Sakshi News home page

పటాకుల అమ్మకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Oct 9 2017 11:44 AM | Updated on Sep 5 2018 9:47 PM

Supreme Court Bans Sale Of Fire Crackers In Delhi, NCR Region - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌)లో పటాకుల అమ్మకంపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పటాకుల అమ్మకంపై నవంబర్‌ 1వ తేదీవరకు నిషేధం అమల్లో ఉండనుంది.

ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో టాపాసుల అమ్మకంపై నిషేధం విధిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్షికంగా ఎత్తివేసిన ఈ ఆదేశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఈ నెల 6న రిజర్వులో ఉంచింది.

దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ 11న టపాసుల అమ్మకం లైసెన్సులను సస్పెండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. తాజాగా అర్జున్‌ గోపాల్‌ అనే వ్యక్తి ఈ ఆదేశాలను పునరుద్ధరించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణ్‌ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని, కాబట్టి ఈ ఏడాది దీపావళి నేపథ్యంలో  పటాకుల అమ్మకంపై నిషేధాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా మద్దతు తెలిపింది. దీంతో పటాకుల అమ్మకంపై నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement