సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి | Six ITBP Jawans Killed In Fratricidal Shootout In Chhattisgarh | Sakshi
Sakshi News home page

సహచరులపై జవాన్‌ కాల్పులు.. 6 గురు మృతి

Dec 4 2019 2:44 PM | Updated on Dec 4 2019 8:40 PM

Six ITBP Jawans Killed In Fratricidal Shootout In Chhattisgarh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాయ్‌పూర్‌ : ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన ఓ జవాన్‌ తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో అతనితో పాటు మరో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపూర్‌లోని కేదార్‌నార్‌ క్యాంప్‌లోని ఐటీబీపీ 45వ బెటాలియన్‌కు చెందిన కొందరు జవాన్ల మధ్య బుధవారం ఉదయం వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన ఐటీబీపీ కానిస్టేబుల్‌ మసుదుల్‌ రెహమాన్‌.. తన సర్వీస్‌ రివాల్వర్‌తో  సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్‌తో సహా 6గురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హెలికాఫ్టర్‌లో రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బస్తర్‌ రెంజ్‌ఐజీ సుందర్‌రాజ్‌ ధ్రువీకరించారు. 

ఈ ఘటనపై సుందర్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘జవాన్ల మధ్య వివాదం తలెత్తడంతో రెహమాన్‌.. తన తోటి సహచరులపైకి కాల్పులు జరిపాడు. అయితే రెహమాన్‌ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరులు ఎదురుకాల్పులు జరపడం వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంద’ని తెలిపారు. మృతులను ఐటీబీపీ హెడ్‌ కానిస్టేబుల్స్‌ దుల్జీత్‌, ఎమ్‌ సింగ్‌, కానిస్టేబుల్స్‌ సుజిత్‌ సర్కార్‌, బిశ్వరూప్‌, బ్రిజేష్‌లుగా గుర్తించారు. గాయపడ్డవారిలో కానిస్టేబుల్స్‌ ఎస్‌బీ ఉల్లాస్‌, సీతారామ్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement