త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లు

Reverse migration begins from UP-Bihar and more passenger trains soon - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ముప్పు నేపథ్యంలో.. అన్ని రెగ్యులర్‌ రైళ్లను నడపడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని శుక్రవారం రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ పేర్కొన్నారు. అయితే, త్వరలో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నామన్నారు. సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ ఉపాధి కోసం నగరాల బాట పట్టడం సంతోషకరమని, ఆర్థిక రంగం కుదుటపడుతోందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు కోరితే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమేనని తెలిపారు.

ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి శ్రామికులు ఎక్కువగా తాము గతంలో పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారన్నారు. జూన్‌ 25 వరకు మొత్తం 4,594 శ్రామిక్‌ రైల్‌ సర్వీసులను నడిపామని, మే 1వ తేదీ నుంచి మొత్తం 62.8 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని వివరించారు. కోవిడ్‌ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కోచ్‌ల నిర్వహణ, ఆహారం, సిబ్బందికి రక్షణ పరికరాలు.. తదితరాల కోసం ఒక్కో కోచ్‌కు సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయిందని వీకే యాదవ్‌ వెల్లడించారు. ఇప్పటికి 5,213 ఐసోలేషన్‌ కోచ్‌లను ఏర్పాటు చేశామని, నిధులు కేంద్ర కోవిడ్‌ కేర్‌ ఫండ్‌ నుంచి అందాయని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top