బాల ఠాక్రే అంటే గౌరవం లేదా? | Narendra Modi Takes Shiv Sena and Sharad Pawar | Sakshi
Sakshi News home page

బాల ఠాక్రే అంటే గౌరవం లేదా?

Oct 6 2014 10:14 AM | Updated on Aug 15 2018 2:20 PM

బాల ఠాక్రే అంటే గౌరవం లేదా? - Sakshi

బాల ఠాక్రే అంటే గౌరవం లేదా?

దివంగత నాయకుడు బాలా సాహెబ్ ఠాక్రే అంటే తనకెంతో గౌరవమని, అందుకే తాను శివసేనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

దివంగత నాయకుడు బాలా సాహెబ్ ఠాక్రే అంటే తనకెంతో గౌరవమని, అందుకే తాను శివసేనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సాంగ్లి జిల్లాలోని టాస్గావ్-లో జరిగిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మరాఠా యోధుడు బాలఠాక్రే లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవేనని ఆయన గుర్తు చేశారు. ఇంతకుముందు సభల్లోకూడా ఆయన శివసేన గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్, ఎన్సీపీల మీద మాత్రమే తన దాడి కొనసాగించారు. కొత్తతరం నాయకులు బీజేపీలో చీలిక తెచ్చారంటూ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన విమర్శలకు సమాధానంగా తాజా విషయం చెప్పారు. మరోవైపు ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా విమర్శలు గుప్పించారు. శివసేనతో పొత్తు తెంచుకోవడం ద్వారా బీజేపీ నాయకులు బాలాసాహెబ్కు వెన్నుపోటు పొడిచారన్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం శివసేన ఎన్ని విమర్శలు చేసినా ఆ పార్టీని నోరెత్తి మాట్లాడకుండా, పొత్తుల శకం ముగిసిపోయిందని, లోక్సభ ఎన్నికల తరహాలో స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.

మహారాష్ట్ర పురోగతి సాధించాలంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే కుదరదని, పూర్తి మెజారిటీ ఇవ్వాల్సిందేనని ఆయన గోండియాలో నిర్వహించిన ర్యాలీలో కూడా చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అసలు వ్యక్తిత్వం లేదని, యూపీఏలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి.. దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఏమీ చేయలేదన్నారు. ''ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించిన పవార్ జీ.. మీరు ప్రజలకు ఏం చేశారు? కనీసం నీళ్లయినా ఇవ్వగలిగారా?'' అంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రను సర్వనాశనం చేశాయని ఈ రెండింటినీ శిక్షించి తీరాల్సిందేనని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement