మోదీ కేబినెట్ విస్తరణకు నేతలు కావలెను!
ఇటీవలి బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించాలనుకున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవలి బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించాలనుకున్నారు. అంతగా పనిచేయని మంత్రులను తొలగించి.. సమర్థులైన నేతలను కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. కానీ అసలు చిక్కంతా సరైన నేతలు దొరకకపోవడం వల్లే వచ్చిందని బీజేపీకి చెందిన విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. పలు మంత్రిత్వశాఖలు, బీజేపీ సీనియర్ నేతల పోర్టుఫొలియోల్లో మార్పులు-చేర్పులు జరిగే అవకాశముందని చాలారోజులుగా హస్తినలో వినిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని, అయితే భారీగా కేంద్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నా.. పార్టీలో అందుకు తగ్గ సమర్థులైన నేతల కొరత ఉండటం సమస్యగా మారిందని మోదీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఒకరు తెలిపారు.
ఇటీవలి పరాజయాల పరంపర నేపథ్యంలో మళ్లీ బీజేపీ అదృష్టరేఖను మార్చి విజయపథంవైపు నడుపాలంటూ మోదీపై నానాటికీ ఒత్తిడి పెరుగుతున్నది. దాదాపు రెండేళ్ల కిందట దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని, కొలువులు కల్పిస్తానని, వృద్ధిరేటును పెంచుతానని హామీ ఇస్తూ మోదీ ఘనంగా అధికారంలోకి వచ్చారు. రానురాను మోదీ ఛరిష్మా మెరుపులు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నది. పెట్టుబడులకు ఊతమిచ్చే సంస్కరణల అమలులో జాప్యం ఆర్థికవ్యవస్థను బిత్తరపోయేలా చేస్తున్నది.
వరుసగా రెండు కరువులతో గ్రామీణ భారతంలో అసంతృప్తి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో చురుగ్గా పనిచేస్తూ సంస్కరణలను వేగవంతం చేయగల సామార్థ్యమున్న నేతలను తన మంత్రిమండలిలోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అభివృద్ధి, సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుకోవాలని మోదీ భావిస్తున్నప్పటికీ, ఇందుకు అనివార్యంగా కనిపిస్తున్న కేబినెట్ విస్తరణకు సమర్థులైన నేతలను ఎంపిక చేయడం అగ్రనాయకత్వం ముందు సవాల్‌గా మారిందని మోదీ సహాయకుడు ఒకరు తెలిపారు.


