breaking news
right replacements
-
‘రైట్ టూ రీకాల్’పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో పనితీరు లేని ఎంపీలు,ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. రాజ్యసభ జీరో అవర్‌లో రాఘవ్ చద్దా ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రజలకు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోతే వారిని తొలగించుకునే హక్కు కల్పించాలని కోరారు.ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇస్తుంది కానీ, ఎన్నికైన ప్రతినిధులను పనితీరు లేకపోవడం లేదా అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తికాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదు అని ఆయన అన్నారు. ‘రైట్ టు రీకాల్’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను పనితీరు లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది అని పేర్కొన్నారు.ఈ హక్కు ఇప్పటికే ప్రపంచంలోని 24 దేశాల్లో అమలులో ఉందన్నారు. అదే సమయంలో పంచాయతీ స్థాయిలో మనదేశంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ ప్రతిపాదనపై సభలో కొంతమంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చద్దా మాత్రం ఈ హక్కు సాధారణ రాజకీయ విభేదాల కోసం కాకుండా, నిరూపితమైన అవినీతి, మోసం, లేదా విధులను నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడాలని స్పష్టం చేశారు.ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రజలకు వారిని తిరస్కరించే శక్తి ఉండాలి అని ఆయన వాదించారు.మొత్తం మీద, రాఘవ్ చద్దా చేసిన ఈ ‘రైట్ టు రీకాల్’ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇది అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావచ్చని భావిస్తున్నారు. -
మోదీ కేబినెట్ విస్తరణకు నేతలు కావలెను!
న్యూఢిల్లీ: ఇటీవలి బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించాలనుకున్నారు. అంతగా పనిచేయని మంత్రులను తొలగించి.. సమర్థులైన నేతలను కేబినెట్లోకి తీసుకోవాలని భావించారు. కానీ అసలు చిక్కంతా సరైన నేతలు దొరకకపోవడం వల్లే వచ్చిందని బీజేపీకి చెందిన విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. పలు మంత్రిత్వశాఖలు, బీజేపీ సీనియర్ నేతల పోర్టుఫొలియోల్లో మార్పులు-చేర్పులు జరిగే అవకాశముందని చాలారోజులుగా హస్తినలో వినిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని, అయితే భారీగా కేంద్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నా.. పార్టీలో అందుకు తగ్గ సమర్థులైన నేతల కొరత ఉండటం సమస్యగా మారిందని మోదీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఒకరు తెలిపారు. ఇటీవలి పరాజయాల పరంపర నేపథ్యంలో మళ్లీ బీజేపీ అదృష్టరేఖను మార్చి విజయపథంవైపు నడుపాలంటూ మోదీపై నానాటికీ ఒత్తిడి పెరుగుతున్నది. దాదాపు రెండేళ్ల కిందట దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని, కొలువులు కల్పిస్తానని, వృద్ధిరేటును పెంచుతానని హామీ ఇస్తూ మోదీ ఘనంగా అధికారంలోకి వచ్చారు. రానురాను మోదీ ఛరిష్మా మెరుపులు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నది. పెట్టుబడులకు ఊతమిచ్చే సంస్కరణల అమలులో జాప్యం ఆర్థికవ్యవస్థను బిత్తరపోయేలా చేస్తున్నది. వరుసగా రెండు కరువులతో గ్రామీణ భారతంలో అసంతృప్తి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో చురుగ్గా పనిచేస్తూ సంస్కరణలను వేగవంతం చేయగల సామార్థ్యమున్న నేతలను తన మంత్రిమండలిలోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అభివృద్ధి, సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుకోవాలని మోదీ భావిస్తున్నప్పటికీ, ఇందుకు అనివార్యంగా కనిపిస్తున్న కేబినెట్ విస్తరణకు సమర్థులైన నేతలను ఎంపిక చేయడం అగ్రనాయకత్వం ముందు సవాల్‌గా మారిందని మోదీ సహాయకుడు ఒకరు తెలిపారు.


