
ముంబై: కార్యకర్తల కోసం ఓ రాజకీయ పార్టీ పత్రికలో ప్రకటన ఇచ్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహదేవ్ జంకర్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష(ఆర్‌ఎస్పీ) ఈ మేరకు ఓ మరాఠీ పత్రికలో కార్యకర్తల కోసం ప్రకటన వెలువరించింది. ‘ఓ జాతీయ పార్టీ కోసం కార్యకర్తలు కావాలి.
సామాజిక సేవతో పాటు భారత్, మహారాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు అయ్యుండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న పార్టీ జిల్లా కార్యాలయంలో హాజరుకావాలి’ అని ఆర్‌ఎస్పీ బుల్ధానా జిల్లా చీఫ్ సుభాష్ రాజ్‌పుత్ ప్రకటన ఇచ్చారు. సుభాష్ మీడియాతో మాట్లాడుతూ అంకిత భావం, విశ్వాసం కలిగిన కార్యకర్తల కోసమే ప్రకటన ఇచ్చినట్లు తెలిపారు.