పశ్చిమ సరిహద్దు ఇక దుర్భేద్యం | Heavy security in Pak border | Sakshi
Sakshi News home page

పశ్చిమ సరిహద్దు ఇక దుర్భేద్యం

Apr 12 2016 2:31 AM | Updated on Mar 23 2019 7:58 PM

పశ్చిమ సరిహద్దు ఇక దుర్భేద్యం - Sakshi

పశ్చిమ సరిహద్దు ఇక దుర్భేద్యం

దేశ పశ్చిమ సరిహద్దు కంచుకోటగా మారనుంది. గుజరాత్ నుంచి జమ్మూకశ్మీర్ వరకు పాకిస్తాన్‌తో ఉన్న 2,900 కిలోమీటర్ల సరిహద్దులో పటిష్టమైన ఐదంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

పాక్ సరిహద్దులో ఐదంచెల పటిష్ట భద్రత
సీసీటీవీలు, రాడార్, లేజర్ కంచెలు..

 
 న్యూఢిల్లీ: దేశ పశ్చిమ సరిహద్దు కంచుకోటగా మారనుంది. గుజరాత్ నుంచి జమ్మూకశ్మీర్ వరకు పాకిస్తాన్‌తో ఉన్న 2,900 కిలోమీటర్ల సరిహద్దులో పటిష్టమైన ఐదంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి, సరిహద్దు రాష్ట్రాల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ తరహా దుశ్చర్యలను అడ్డుకోవడానికి దీన్ని ప్రతిపాదించారు. ‘కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఐబీఎంఎస్) అని పేర్కొంటున్న ఈ వ్యవస్థ కింద నిరంతరం ఆధునిక సాంకేతిక  నిఘా అమలు చేస్తారు.

ఇది అత్యంత వ్యయంతో కూడకున్నదైనా చొరబాట్లు, ఉగ్రవాద దాడుల నియంత్రణకు మరో ప్రత్యామ్నాయం లేదని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. స్వాతంత్య్రం తర్వాత పశ్చిమ సరిహద్దును పూర్తిగా మూసేయడం ఇదే తొలిసారి కానుంది. సీఐబీఎంఎస్ నిర్మాణం కోసం రెండు వారాల కిందట అంతర్జాతీయ టెండరు జారీ చేశారని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద పంజాబ్, కశ్మీర్(జమ్మూ)లో చెరోచోట 5 కి.మీ మేర పనులు మొదలయ్యాయన్నారు. పంజాబ్, గుజరాత్‌లలో 30 కి.మీ మేర సీఐబీఎంఎస్ ఏర్పాటుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు.
 
 ఏముంటాయి?
 ► సీసీటీవీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, నిఘా రాడార్, భూగర్భ నిఘా సెన్సర్లు, లేజర్ కంచెలను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేస్తారు. చొరబాట్లు, దాడుల సమయంలో ఒక పరికరం పనిచేయకపోతే మరోపరికరం కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది.
 ► కంచెలు లేని కొండలు, నదీతీరాలు సహా 130 ప్రాంతాల్లో లేజర్ కంచెను ఏర్పాటు చేస్తారు.
 ► రాడార్ వ్యవస్థ 360 డిగ్రీల కోణంలో పనిచే స్తుంది. కెమెరాలు సరిహద్దుకు అటువైపు, ఇటువైపు రేయింబవళ్లు కన్నేస్తాయి. దీంతో చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా, వాటికి సాయపడే వ్యక్తులపైనా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
 ► ఒక కిలోమీటరుకు సీఐబీఎంఎస్‌ను ఏర్పాటుకు చేయడానికి కోటి రూపాయలు ఖర్చవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement