
ప్రతీకాత్మక చిత్రం
భారీ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్లు, దుకాణాల ముందు ఆగిపోవడంతో..
సాక్షి, చెన్నై: చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా మూడు గంటల (సాయంత్రం 5 నుంచి 8 గంటలు) పాటు కురిసిన వర్షాలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. ట్రాఫిక్‌జామ్‌తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైన వాన 8.30 వరకు కురవడంతో.. ఆరు గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అన్నా సలై, వైట్ రోడ్, పీటర్స్ రోడ్, డాక్టర్ రాధాకృష్ణ సలై, యాక్టర్ రోడ్, సర్దార్ పటేల్ రోడ్, జీఎస్టీ రోడ్, పొన్నాంమళే రోడ్, సీటీహెచ్ రోడ్లన్నీ వరదమయ్యాయి. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, భారీ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్లు, దుకాణాల ముందు ఆగిపోవడంతో సమస్య మరింత జఠిలమైందని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వర్షాల కారణంగా ప్రభుత్వం ఇప్పటికే ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.