జేడీయూ అభ్యర్థులకు మద్దతివ్వండి | give to support to jdu candidates | Sakshi
Sakshi News home page

జేడీయూ అభ్యర్థులకు మద్దతివ్వండి

Jun 15 2014 1:39 AM | Updated on Sep 18 2019 2:56 PM

జేడీయూ అభ్యర్థులకు మద్దతివ్వండి - Sakshi

జేడీయూ అభ్యర్థులకు మద్దతివ్వండి

బీహార్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం జేడీయూ అగ్రనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సాయం కోరారు.

రాజ్యసభ ఎన్నికల కోసం లాలూ సాయం కోరిన నితీశ్
 
పాట్నా: బీహార్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం జేడీయూ అగ్రనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సాయం కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐ మద్దతు కూడా ఆయన కోరారు. గత నెలలో బీహార్‌లో జితన్‌రాం మంజీ ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో ఆర్‌జేడీ, కాంగ్రెస్, సీపీఐ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం నితీశ్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకోసం 20 ఏళ్ల తర్వాత లాలూ సాయాన్ని అర్థించారు.

 మరోవైపు ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్లకు బీజేపీ, జేడీయూ అసమ్మతి వర్గం మద్దతిస్తున్నాయి. శనివారం పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో నితీశ్ మాట్లాడుతూ.. జితన్ రాం మంజీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బీహార్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని అడ్డుకునేందుకు తాను లాలూను సాయం కోరినట్టు తెలిపారు. కాగా, నితీశ్ ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత సుశీల్‌మోడీ ఖండించారు. నితీశ్ రిమోట్‌తో నడుస్తున్న మంజీ ప్రభుత్వాన్ని కూలదోయడంపై తమకు ఎటువంటి ఆసక్తి లేదన్నారు. నితీశ్ తన ఇంటికీ తానే నిప్పు పెట్టుకుని బీజేపీని నిందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలపాటు ఎవరిపై పోరాటం చేశారో.. వారినే ఇప్పుడు సాయం అడుగుతున్నారని తప్పుపట్టారు. మరోవైపు నితీశ్ లాలూ సాయం కోరడాన్ని జేడీయూ అసమ్మతి నేత జ్ఞానేంద్ర సింగ్ తీవ్రంగా ఆక్షేపించారు. 2010 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఇది తూట్లు పొడవటమే అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement