వరద విలయం

Flood death toll rises to 119 - Sakshi

ఐదు రాష్ట్రాల్లో మృతులు: 119.. కేరళలో అత్యధికంగా 57 మంది

ఆగని వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం

చెన్నై/తిరువనంతపురం/బెంగళూరు/ముంబై: వారం రోజులుగా కురుస్తున్న వానలతో దక్షిణాదిన కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఐదు రాష్ట్రాల్లో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కేరళలో అత్యధికంగా 57 మంది, కర్ణాటకలో 26 మంది చనిపోయారు. గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 19 మంది, మహారాష్ట్రలో 12 మంది మృతి చెందారు. 11న కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ తెలిపారు.

రెండు జిల్లాలపై తీవ్ర ప్రభావం
భారీ వర్షాలతో కేరళలోని 8 జిల్లాలు ముఖ్యంగా వయనాడ్, కోజికోడ్‌ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వర్షం సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు 57 మంది మృతి చెందారని యంత్రాంగం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సహాయక శిబిరాలకు తరలించిన 1.25 లక్షల మందిలో వయనాడ్, కోజికోడ్‌ జిల్లాల వారే 50 వేల మంది వరకు ఉన్నారు. మలప్పురం జిల్లా కవలప్పర వయనాడ్‌ జిల్లా పుత్తుమల కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం ఉధృతి కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్‌ జిల్లాలోని బనసురసాగర్‌ డ్యాం నిండటంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దేశంలో మొదటిది, ఆసియాలోనే రెండో పెద్దది ఎర్త్‌డ్యామ్‌ బనసురసాగర్‌. కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలకు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 23 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.  

వరదలో చిక్కుకున్న మాజీ ఎంపీ కుటుంబం
కర్ణాటకలోనూ వానలు, వరద తీవ్రత కొనసాగుతోంది. వివిధ ఘటనల్లో రాష్ట్రంలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 2.35 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కేంద్ర మాజీ మంత్రి జనార్థన్‌ పుజారి నివాసం వరదల్లో చిక్కుకుంది. దీంతో అధికారులు ఆయనతోపాటు కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని అవలాంచిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన కుంభవృష్టితో కొండ, అటవీప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఇద్దరు శిశువులు సహా 11 మందిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.గుజరాత్‌లో వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top