దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి

Coronavirus : 8380 New Positive Cases Reported In India - Sakshi

ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు

దేశంలో 8,380 మందికి వైరస్‌.. 193 మంది మృతి

తెలంగాణలో ఏకంగా 199 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో కొత్తగా ఐదుగురి మృతి.. 82కి చేరిన మరణాలు

యాదాద్రికీ సోకిన కరోనా.. తొలిసారిగా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 8,380 మందికి ఈ వైరస్‌ సోకగా.. రాష్ట్రంలో ఏకంగా 199 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక దేశంలో మరణాల సంఖ్య 5,164కి చేరగా.. ఆదివారం ఒక్కరోజులో 193 మంది మృతిచెందారు. కేసులపరంగా భారత్‌ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో నిలి చింది. దేశవ్యాప్తంగా 1,82,143 కేసులు నమోదుకాగా, 89,995 యాక్టివ్‌ కేసులున్నాయి.

జీహెచ్‌ఎంసీలోనే అధికంగా...
రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే ఏకంగా 199 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఐదుగురు కరోనాతో చనిపోయారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,698కి చేరింది. ఆదివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 122, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు ఉన్నాయి. ఇంతకాలం కరోనాకు దూరంగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాకూ ఈ మహమ్మారి వ్యాపించింది. ఆదివారం తొలిసారిగా అక్కడ ఒక కేసు నమోదైంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులు ముగ్గురికి వైరస్‌ సోకిందని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన కేసులు 2,264 ఉండగా.. వలస కార్మికులు, సౌదీ అరేబియాతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చినవారు 434 మంది ఉన్నారు. అందులో  వలస కార్మికులు 192 మంది ఉండగా.. సౌదీ అరేబియా నుంచి వచ్చినవారు 212 మంది ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 82 మంది చనిపోయారు. మొత్తం 1,428 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,188 మంది చికిత్స పొందుతున్నారు.

హాట్‌స్పాట్‌గా పహాడీషరీఫ్‌..
వరుసగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 51 కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ సంస్థల ప్రతినిధులు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మినార్‌ కాలనీలో శని, ఆదివారాలలో వంద మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. చెన్నైలోని ల్యాబ్‌కు తీసుకెళ్లి వాటిని పరీక్షించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top