
గాంధీనగర్: 2019లో తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని 18 శాతంగా ఉండే ఏకైక శ్లాబుకు కుదిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. భారత్‌కు ఐదంచెల జీఎస్టీ అవసరం లేదని, ఈ పన్ను విధానంలో నిర్మాణాత్మక మార్పులు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
శనివారం గుజరాత్ రాజధాని గాంధీ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ...కేంద్రం శుక్రవారం సుమారు 200 వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గించినా అది సరిపోదని పేర్కొన్నారు. ‘ కేంద్రం చర్యలు సరిపోవు. గబ్బర్‌సింగ్ ట్యాక్స్(జీఎస్టీ)ను రద్దుచేసి ఒకేఒక శ్లాబు, అది కూడా 18 శాతంగా ఉన్న పన్ను వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఒకవేళ బీజేపీ అలా చేయకుంటే 2019లో మేమే చేస్తాం’ అని అన్నారు. కాంగ్రెస్, సాధారణ ప్రజలు ఒత్తిడి పెంచడం వల్లే బీజేపీ దిగొచ్చి పలు వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి 18 శాతం శ్లాబులోకి మార్చిందన్నారు.
అక్షరధామ్ ఆలయంలో పూజలు
అంతకుముందు, రాహుల్ గాంధీ సుప్రసిద్ధ అక్షరధామ్ ఆలయంలో పూజలు నిర్వహించి ఉత్తర గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఉదయం గాంధీనగర్ చేరుకున్న రాహుల్ అక్షరధామ్ ఆలయానికి వెళ్లి స్వామినారాయణ్‌కు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత మూడు రోజుల పాటు ఆరు జిల్లాల్లో సాగే తన పర్యటనను ప్రారంభించారు. ఎన్నికలకు ముందే రాహుల్ హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారని బీజేపీ విమర్శించింది.
ఇలాంటి జిమ్మిక్కుల ద్వారా ఓట్లు పొందాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ తన నకిలీ లౌకికవాదాన్ని పక్కనపెట్టి హిందూత్వను గౌరవించాలని గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. తమ నాయకుడు ఓ దేవాలయానికి వెళ్లడాన్ని కూడా వ్యతిరేకిస్తున్న బీజేపీకి గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, సాయంత్రం బనాస్‌కాంతా జిల్లాలోని అంబాజీ ఆలయాన్ని రాహుల్ సందర్శించారు.