ఎన్నికలు ఆపేస్తా!

Collector Warning to Congress Candidate in Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: కరూర్‌ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అన్బళగన్‌కు డీఎంకే, కాంగ్రెస్‌ వర్గాలు బెదిరింపులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ తననే బెదిరిస్తారా ఎన్నికల్ని ఆపేస్తా అంటూ కాంగ్రెస్‌ అభ్యర్థికి హెచ్చరిక ఇస్తూ చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వేళ కరూర్‌ లోక్‌సభ పరిధిలో టెన్షన్‌ పెరిగింది. కరూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జ్యోతిమణి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తంబిదురైకు వ్యతిరేక పవనాలు ఉన్నట్టుగా  సంకేతాలు వెలువడుతూ వస్తున్నాయి. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జ్యోతిమణి తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు.

అయితే, ఈ సీటు చేజారకుండా మంత్రి విజయ భాస్కర్‌ నేతృత్వంలో అన్నాడీఎంకే కూటమి వర్గాలు వ్యూహాలకు పదునుపెట్టారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా డీఎంకే నేత సెంథిల్‌బాలాజి నేతృత్వంలో  ఆకూటమి వర్గాలు జ్యోతిమణి కోసం రేయింబవళ్లు శ్రమించే పనిలో పడ్డారు. నామినేషన్‌ దాఖలు నుంచి ప్రచారాల ముగింపు వరకు కరూర్‌లో ఇరు వర్గాల మధ్య సమరం అన్నది లేని రోజంటూ లేదు. ఇక, ఎన్నికల ప్రచారం చివరి రోజున సైతం కరూర్‌ రణరంగానికి మారే పరిస్థితి చోటు చేసుకుంది. కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఇరువురు ఒకే చోట ప్రచార సభ ముగింపునకు తగ్గట్టుగా అనుమతులు కోరడం, ఇది కాస్త వివాదానికి దారి తీయడం, కలెక్టర్, ఎన్నికల అధికారి జోక్యం చేసుకోవడం, ఒత్తిళ్లు పెరగడం వంటి పరిణామాలు కరూర్‌లో ఉత్కంఠను రేపాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అన్భళగన్, కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిమణి మధ్య సాగిన ఆడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఆడియో వైరల్‌ : కలెక్టర్‌ అన్బళగన్‌కు డీఎంకే, కాంగ్రెస్‌ వర్గాలు బెదిరింపులు ఇచ్చినట్టుగా తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే మీడియా ముందుకు వచ్చిన అన్బళగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆంతోనియామలై పోలీసుస్టేషన్‌లో డీఎంకే నేత సెంథిల్‌ బాలాజి, కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతి మణిలతో పాటు వంద మందిఫై ఫిర్యాదు చేశారు. కేసులు నమోదయ్యాయి. ఈ  పర్వం ఓ వైపు సాగిన నేపథ్యంలో, మరో వైపు తనను కలెక్టర్‌ బెదిరించారన్నట్టుగా జ్యోతిమణి స్పందించే రీతిలో ఓ ఆడియో వైరల్‌గా మారింది. జ్యోతి మణి, కలెక్టర్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, అనుమతి కోసం తమ వాళ్లు వచ్చారని జ్యోతిమణి సమాధానం ఇవ్వడం గమనార్హం.  సమస్యను జఠిలం చేస్తే ఎన్నికల్ని ఆపేస్తానంటూ కలెక్టర్‌  హెచ్చరించడంతో జ్యోతిమణి మౌనం వహించక తప్పలేదు. అధికార పక్షంపై డీఎంకే, కాంగ్రెస్‌ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు అందరూ ప్రజల్ని బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని, తంబిదురైకు అనుకూలంగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని జ్యోతిమణి ఆరోపిస్తున్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిపే రీతిలో ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల్ని ఆపించేందుకు కాంగ్రెస్, డీఎంకే కుట్ర చేస్తున్నట్టుగా తంబిదురై మద్దతుదారులు ఎదురు దాడి చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top