మిషెల్‌ నోట ‘మిసెస్‌ గాంధీ’ మాట

Christian Michel named 'Mrs Gandhi - Sakshi

విచారణలో పరోక్షంగా సోనియా, రాహుల్‌ను ప్రస్తావించిన మధ్యవర్తి

అతడికి బయటి నుంచి సూచనలు అందుతున్నాయి

న్యాయ సాయం తక్షణమే నిలిపేయండి

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో కోర్టును కోరిన ఈడీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ఈ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిషెల్‌..ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. మిషెల్‌ తనకు కల్పించిన న్యాయ సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అతడికి బయటి నుంచి సలహాలు, సూచనలు అందుతున్నాయని ఈడీ అధికారులు శనివారం ఢిల్లీ కోర్టుకు నివేదించారు.

‘మిసెస్‌ గాంధీ’ గురించి అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో తెలపాలంటూ తన లాయర్లకు చీటీలు పంపాడని ఆరోపించారు. దీంతో మిషెల్‌ లాయర్లను కలుసుకోవడంపై కోర్టు ఆంక్షలు విధించింది. తరువాత వెకేషన్‌ జడ్జి చంద్రశేఖర్‌  మిషెల్‌కు ఈడీ కస్టడీని మరో వారం రోజులు పొడిగించారు. తాజా పరిణామం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఈ కుంభకోణంలో గాంధీ కుటుంబం పాత్ర ఉందని ఈడీ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని బీజేపీ పేర్కొంది. ఒక కుటుంబం పేరు చెప్పేలా మిషెల్‌పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

సాకులు వెతుకుతున్నాడు..
విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేసిన మిషెల్‌..తన సహచరులు, తనకు సాయం చేసిన వారిని కాపాడేందుకు సాకులు చెబుతున్నాడని ఈడీ పేర్కొంది. మిషెల్‌ చాలా నెమ్మదిగా రాస్తున్నాడని, ఇంకా చాలా ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాల్సి ఉందని తెలిపింది. ఈ కుంభకోణంలో చేతులు మారిన నిధుల్ని దారి మళ్లించిన సంస్థలకు సంబంధించి కొత్త ఆధారాల్ని కనుగొన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

మిషెల్‌కు భారత అధికారులతో ఉన్న సంబంధాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే కస్టడీని పొడిగించాలని కోరింది. అధికారులు, ఇతర ప్రముఖులకు లంచాలు ఇచ్చేందుకు మిషెల్‌ ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించాడో గుర్తించాలంటే అతడిని ఢిల్లీలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపింది.  అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో మిషెల్‌ ప్రధాన మధ్యవర్తిగా తేలిందని,  ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేయడంతో పాటు, లంచాలు చెల్లించడంతో కీలక పాత్ర పోషించాడని ఆరోపించింది.  

నిజాలు బయటికి వస్తున్నాయి: బీజేపీ
ఈడీకి మిషెల్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయుధంగా మార్చుకున్న బీజేపీ కాంగ్రెస్‌పై ముప్పేట దాడికి దిగింది. ఈ కుంభకోణంలో నిజాలు బయటికి వస్తున్నాయని, గాంధీల కుటుంబానికి ఇందులో పాత్ర ఉందని స్పష్టమవుతోందని పేర్కొంది. మోదీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న రాహుల్‌ వివరణ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. కాగా, ఈ ఆరోపణల్ని కాంగ్రెస్‌ తోసిపుచ్చుతూ..గాంధీ కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని తిప్పికొట్టింది. బీజేపీ స్క్రిప్ట్‌రైటర్‌లు ఓవర్‌టైమ్‌ పనిచేసి ఏం చెప్పాలో దర్యాప్తు సంస్థలకు పంపుతున్నారంది.

చీటీల రాయబారమిలా..
తన లాయర్ల ద్వారా మిషెల్‌ బయటి నుంచి సలహాలు పొందుతున్నారని, ఆయనకు న్యాయ సాయాన్ని నిలిపేయాలని కోర్టును ఈడీ కోరింది. 27న విచారణలో మిషెల్‌ ‘మిసెస్‌ గాంధీ’ని ప్రస్తావించారంది. ‘ఇటలీ మహిళ కొడుకు’ దేశానికి తదుపరి ప్రధాని ఎలా కాబోయేదీ చెప్పాడని ఈడీ పేర్కొంది. వైద్య పరీక్షల సమయంలో మిషెల్‌ తన లాయర్‌కు ఓ చీటి చేరవేశాడని, ఈ కాగితాన్ని చదవగా అందులో ‘మిసెస్‌ గాంధీ’ సంబంధిత ప్రశ్నలున్నాయని తెలిపింది.

ఈడీ ఎక్కడా సోనియా, రాహుల్‌  పేర్లను ప్రస్తావించకుండా ‘మిసెస్‌ గాంధీ’, ‘ఇటలీ మహిళ కొడుకు’ అని సంబోధించడం గమనార్హం. తన కస్టడీలో ఉన్నంత కాలం మిషెల్‌ అతని లాయర్లను కలుసుకోకుండా చూడాలని ఈడీ కోర్టుకు అభ్యర్థించింది. దీనికి కోర్టు స్పందిస్తూ..మిషెల్‌ లాయర్లలో ఎవరో ఒకరే అది కూడా కొంత దూరం నుంచే ఆయనకు న్యాయ సాయం చేయాలని ఆదేశించింది. రోజులో ఉదయం 10 గంటలు, సాయంత్రం 5 గంటల సమయంలో 15 నిమిషాలే కలిసే అనుమతిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top