డిగ్గీరాజా..క్షమాపణ చెప్పు, లేదంటే! | Apologise, Else Lawsuit, Chief Minister Fadnavis Warns Digvijaya Singh | Sakshi
Sakshi News home page

డిగ్గీరాజా..క్షమాపణ చెప్పు, లేదంటే!

Mar 21 2016 7:11 PM | Updated on Sep 3 2017 8:16 PM

డిగ్గీరాజా..క్షమాపణ చెప్పు, లేదంటే!

డిగ్గీరాజా..క్షమాపణ చెప్పు, లేదంటే!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు లీగల్ నోటీసులు పంపారు.

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు లీగల్ నోటీసులు పంపారు. దిగ్విజయ్ తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

ఫడ్నవిస్ సతీమణి పనిచేసే బ్యాంకులో ఖాతాలు తెరువాల్సిందిగా డెవలపర్స్ కు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఆదేశాలు ఇవ్వడాన్ని దిగ్విజయ్ తప్పుబట్టారు. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితోనే సీఎం ఫడ్నవిస్ ఈ ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రెండు వారాల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ఆయనపై క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకుంటానని ఫడ్నవిస్ ఈ లీగల్ నోటీసులలో స్పష్టం చేసినట్టు ఆయన న్యాయవాది గణేష్ సోవాని తెలిపారు.

దిగ్విజయ్ ఆదివారం ట్విట్టర్ లో ఫడ్నవిస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'మహారాష్ట్ర సీఎం నేతృత్వంలోని ఎస్ఆర్ఏ డెవలపర్స్ ఖాతాలను వర్లీలోని యాక్సిస్ బ్యాంకు ఖాతాలోనే తెరువాలని అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఫడ్నవిస్ భార్య  యాక్సిస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్. ఓ ప్రైవేటు బ్యాంకుకు దోచిపెడుతున్నారు. ఇంతకన్నా ఆశ్రిత పక్షపాతం ఉంటుందా?' అని దిగ్విజయ్ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement