ఎన్డీయేలోనే శివసేన | Anant Geete says Shiv Sena still part of NDA | Sakshi
Sakshi News home page

ఎన్డీయేలోనే శివసేన

Oct 1 2014 8:49 PM | Updated on Sep 2 2017 2:14 PM

అనంత్ గీతే

అనంత్ గీతే

కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనపై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్‌లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపంకంపై ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో 25 ఏళ్ల నుంచి మిత్ర పక్షంగా ఉన్న శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం నుంచి శివసేన తప్పుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. వీటిపై గీతే స్పందిస్తూ.. ఈ అంశంపై తాను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. తాము ఎన్డీయే భాగస్వాములుగా కొనసాగుతామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందన్నారు.

మహారాష్ట్రలో సాధించిన 42 ఎంపీ స్థానాల్లో తమ పాత్రా కీలకమేనని చెప్పారు.  అందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత బీజేపీ, సేన కలిసే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరైనది కాదన్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని వ్యాఖ్యానించారు. గురువారం ఉద్ధవ్ ఠాక్రే మోదీతో సమావేశమవుతారన్న వార్తలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement