
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన ఓ సంగీత దర్శకుడిలా కాకుండా ఓ మాములు మనిషిగా ఎప్పుడు చెరగని చిరునవ్వుతో మనకు దగ్గరి మనిషిలా కనిపిస్తారు. ముఖ్యంగా తేజతో కలిసి పనిచేసిన చిత్రాలకు క్లాస్, మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా సంగీతాన్ని అందించి ఉర్రూతలూరించారయన. ఇప్పుడు ఆయన ఓ టాప్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో పెన్నుకు పదును పెడుతూ క్లాస్ డైరెక్టర్ అనిపించుకుంటున్న త్రివిక్రమ్ ఒకప్పుడు ఆర్‌పీ పట్నాయక్ రూమ్‌మేట్ అని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను సునీల్, త్రివిక్రమ్ రూమ్‌మేట్స్ అని తాను సినిమాల్లోకి రాకముందే ఆనందం అనే ఓ ఆల్బమ్ చేశానని, దానికి త్రివిక్రమ్‌గారే లిరిక్స్ రాశారని చెప్పారు. త్రివిక్రమ్ తన చిత్రాలకు ఇతర సంగీత దర్శకులను పెట్టుకుంటున్నా తాను ఏనాడు తనకు అవకాశం ఇవ్వాలని అడగలేదని చెప్పారు. తన చిత్రానికి సరిపోవు సంగీతం ఫలానా సంగీత దర్శకుడితోనే సాధ్యమవుతుందనే ఆయన ఆలోచనకు భంగం కలగకూడదనే తాను అలా ఏనాడు అడగలేదంటూ స్నేహంలో ఉన్న బాధ్యతను కూడా తన మాటల ద్వారా చెప్పుకొచ్చారు.