తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన దీపికా

Ranveer Singh Comments On Deepika Padukone Wax Statue - Sakshi

బాలీవుడ్‌ క్రేజీ హీరో రణ్‌వీర్‌ సింగ్‌.. తన భార్య దీపికా పదుకొనేపై ప్రేమను కురిపించే ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్సవ్వడు. వీలు చిక్కినప్పుడల్లా భార్యపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటాడు. అయితే ఇప్పుడు దీపికా పైనే కాదు మరొక ‘అమ్మాయి’పై కూడా ఈ ‘సింబా’ మనసు పారేసుకున్నాడు. ‘నాతో పాటు నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్లచ్చా’ అంటూ స్వీట్‌ ప్రపోజల్‌ ఆమె ముందు ఉంచాడు. అంతేకాదు ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. అదేంటి రణ్‌వీర్‌ ఇలా ఎలా చేస్తాడు అంటూ కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే రణ్‌వీర్‌ ప్రేమను కురిపించింది ఎవరిపైనో కాదు దీపికా మీదే. అవును దీపికా మైనపు బొమ్మను చూసి ముగ్ధుడైన రణ్‌వీర్‌.. బొమ్మను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

రణవీర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నాడా?

ఇంతకీ విషయమేమిటంటే... లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కొలువుదీరిన తన మైనపు విగ్రహాన్ని బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త రణ్‌వీర్‌తో పాటు అత్తమామలు, తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో దీపికా సహా అభిమానులు, రణ్‌వీర్‌ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. విగ్రహం చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ఇక రణ్‌వీర్‌ అయితే ఎంత బావుందో.. నాతో పాటు తీసుకెళ్తా అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్‌ చేయడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అందుకు ప్రతిగా.. ‘ నువ్వు 83 షూటింగ్‌ కోసం వస్తావుగా. అప్పుడు నన్ను మిస్సయితే ఇక్కడికి వచ్చెయ్‌ అంటూ దీపికా కొంటెగా సమాధానమిచ్చారు. కాగా సింబా, గల్లీ బాయ్‌ వంటి సూపర్‌ హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్న రణ్‌వీర్‌ ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో నటిస్తున్న 83 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక దీపికా కూడా యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ బయోపిక్‌ ‘చప్పాక్‌’లో నటించడంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top