వివాదంలో ‘రంగస్థలం’

 Rangasthalam song sparks controversy - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా రంగస్థలం. 1985 కాలం నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫస్ట్‌లుక్ నుంచి టీజర్‌ వరకు చిత్ర యూనిట్‌ రిలీజ్ చేస్తున్న ప్రతిదీ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు అభిమానుల‌కు తెగ న‌చ్చేశాయి. ఈ నెల 30న రంగస్థలం విడుదల చేయాలనుకుంటున్న చిత్ర యూనిట్‌ను తాజాగా ఓ వివాదం చుట్టు ముట్టింది.

ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ... పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు’ అంటూ సాగే పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. చంద్రబోస్‌ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ ఆకట్టుకున్నాయి. చెర్రీని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్స్‌ కూడా ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సాంగ్‌లో ‘ గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లిరిక్స్‌ యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని ఆల్‌ ఇండియా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పాటలోని ఆ చరణాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా విడుదలని అడ్డుకుంటామ‌ని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకూ రంగస్థలం చిత్ర యూనిట్‌ స్పందించలేదు.

సినిమా పాటలపై వివాదం తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో గుడిలో బడిలో పాటలో 'నమకం', 'చమకం' అనే రెండు పదాలని తొలగించాలని.. బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top