తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. ఆయన రాసిన ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే తీసుకొచ్చిపెట్టింది. చిన్న చిన్న పదాల్లో లోతైన అర్ధాన్ని చెప్పడం ఆయన స్టైల్. ఇప్పటికి వరకు ఆయన 3800 పాటలు రాశాడు. వాటిల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ పాట మాత్రం 20 ఏళ్ల తర్వాత బాగా వైరల్ అయింది.రాసిన 20 ఏళ్ల తర్వాత ఆ పాటతో చంద్రబోస్‌కి మంచి గుర్తింపు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబోసే చెప్పారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాట గురించి చెప్పుకొచ్చాడు.
సాధన చేస్తే ఫలితం ఉంటుంది..
సాధన చేస్తే గుర్తింపు, ఫలితం సాధన చేస్తే ఫలితం, గుర్తింపు వస్తూనే ఉంటుంది. మన కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది. నేను రాసిన ఒక పాటకు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఆ పాట ఇదే. ‘ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి’. ఇది 20 ఏళ్ల క్రితం ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమా కోసం రాశాను. ఆ సినిమా రిలీజ్ అయినా ఈ పాటకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ అదే పాటను ఒక స్టేజ్ మీద పాడిన తర్వాత అది బాగా వైరల్ అయి.. నాకు గుర్తింపు వచ్చింది. లైఫ్ ఇన్స్‌రెన్స్ ఏజెంట్ల మీటింగ్‌లో ఆ పాటను పాడాను. వాళ్లంతా ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని వారి బిజినెస్‌ని పెంచుకున్నారు.
నా భార్య ఏడ్చింది
ఇదే ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాలోని ‘ఓరయ్యో..’ అనే ఎమోషన్ సాంగ్ గురించి మాట్లాడారు. ఏదైనా పాట రాయాలంటే.. ఆ సన్నివేశాలలో మనల్ని మనం ఊహించుకోవాలి. రంగస్థలంలోని ‘ఓరయ్యో..’ పాటను నేను అలానే రాశాను. మన ఆప్తులు చనిపోతే ఎలా రోధిస్తాం.. ఎలా బాధపడతారు.. దాన్నే ఈ పాటలో చూపించాను. ‘ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడె మొయ్యాలా... ఈ సేతితోనే కొరివి పెట్టాలా... ఓరయ్యో నా అయ్యా.. ’ అనే పల్లవిని ఇంట్లోనే రాశాను. వంట చేస్తున్న నా భార్య దగ్గరకు వెళ్లి పాట సందర్భం చెబతూ... ‘అన్న చనిపోతాడు..తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు.. ఆ సందర్భంలో పాట వస్తుంది’ అంటూ ఈ పాటను వినిపిస్తే.. తను ఏడ్చేసింది. పాడుతూ నేను ఏడిస్తే.. వింటూ తాను కూడా ఏడ్చేసింది. రచయిత అనేవాడు ప్రతి సందర్భాన్ని తనదిగా భావిస్తేనే.. తనదైన స్పందన అందిస్తాడు. రచయితకు కావాల్సింది పాండిత్యం.. భాష మీద విపరీతమైన సాధికారతో కాదు.. మనకున్న జ్ఞానం.. మనదైన అనుభవం.. మనలోని స్పందన.. ఈ మూడే రచయితను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి’ అని చంద్రబోస్ చెప్పుకొచ్చాడు.


