తెలుగు సినిమా మారుతోంది | Next Yenti Trailer Released | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా మారుతోంది

Nov 18 2018 3:22 AM | Updated on Sep 15 2019 12:38 PM

Next Yenti Trailer Released - Sakshi

నవదీప్, తమన్నా, సందీప్, కునాల్‌ కోహ్లి, అక్షయ్‌ పూరి

రోజు వారి జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని ప్లాన్‌ చేసుకుంటాం. అలా ప్లాన్‌ చేసుకున్న ఒక్కో పని అయిపోగానే ‘నెక్ట్స్‌ ఏంటి’ అనుకుంటాం. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంది. తమన్నా, సందీప్‌ కిషన్‌లు నాయికా, నాయకులుగా నవదీప్, పూనమ్‌ కౌర్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి’. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కునాల్‌ కోహ్లి దర్శకత్వం వహించారు. రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మాతలుగా వ్యవ హరించిన ఈ చిత్రానికి లియోన్‌ జోన్స్‌ సంగీతాన్ని అందించారు.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు కునాల్‌ కోహ్లీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను మొదట నేను శరత్‌బాబుగారికి పంపాను. ఆయన ఎంతో థ్రిల్‌ ఫీలయ్యి నన్ను హైదరాబాద్‌ రమ్మన్నారు. శరత్‌బాబుగారు, తమన్నా తండ్రీకూతుళ్లలా నటించారు. ఈ పాత్రల మధ్య సీన్స్‌ చాలా బావుంటాయి. భారతదేశ సంప్రదాయాన్ని తెలిపే చిత్రం ఇది. సినిమాకి భాష ఇబ్బంది కాదు, కంటెంట్‌ బావుంటే ఏ భాషలోనైనా ఆడుతుంది’’ అన్నారు.

నవదీప్‌ మాట్లాడుతూ– ‘‘తమన్నా ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేసింది. ఆమె డబ్బింగ్‌ బావుంది. సినిమా ట్రైలర్‌లో ఉన్న కంటెంట్‌ వేరు.. సినిమాలో ఉన్న ఫీల్‌ వేరు. యూత్‌ని ఆకట్టుకోవటానికి ట్రైలర్‌ను అలా కట్‌ చేశారు’’ అని చెప్పారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ కునాల్‌ దర్శకుడు అనగానే హిందీ సినిమా అనుకున్నాను. తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని. కథ వినగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మ్యూజిక్‌ చాలా బావుంది. నేను వర్క్‌ చేసిన ప్రొడ్యూసర్స్‌లో నాకు బాగా నచ్చిన నిర్మాత కిరణ్‌గారు.. ఆ  తర్వాత అక్షయ్‌గారు. తమన్నాతో వర్క్‌ చేయటం మంచి ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు.

తమన్నా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రోజు రోజుకు మారుతోంది. తెలుగు సినిమాలు భారతదేశం మొత్తం తెలిసిపోతున్నాయి. నేను ముంబైలో పుట్టినా తెలుగు సినిమా నాకు చాలా ఇంపార్టెంట్‌. దర్శకుడు కునాల్‌గారికి తెలుగు ఇండస్ట్రీకి బిగ్‌ వెల్‌ కమ్‌ చెబుతున్నా. ఈ చిత్రంలో నా కేరక్టర్‌ నేనే ప్లే చేశానా అనిపించింది. డిసెంబర్‌లో సినిమా విడుదలవుతుంది, అందరూ ఆదరించాలి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement