రాజమౌళిని ఫాలో అవుతున్న శంకర్‌..! | Director Shankar Collaborate With Vikram And Vijay Before Indian 2 Movie | Sakshi
Sakshi News home page

రాజమౌళి బాణీలో..

May 2 2019 8:15 AM | Updated on May 2 2019 8:15 AM

Director Shankar Collaborate With Vikram And Vijay Before Indian 2 Movie - Sakshi

తమిళ సినిమాను హాలీవుడ్‌ సినీ పరిశ్రమ తిరిగి చూసేలా చేసిన దర్శకుడు శంకర్‌ అయితే తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి అని చెప్పక తప్పదు. ఇది అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరు బ్రహ్మాండాలకు మారు పేరు. గ్రాఫిక్స్‌ను వాడుకోవడంలో సిద్ధహస్తులు. శంకర్‌ పనితనానికి రాజమౌళి అబ్బురపడతారు. రాజమౌళి దర్శక ప్రతిభకు శంకర్‌ ఫిదా అవుతారు. ఇది 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆహూతులకు కనువిందు చేసిన సంఘటన. కాగా రాజమౌళి జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీస్టార్‌ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

కాగా దర్శకుడు శంకర్‌ కూడా రాజమౌళి బాణీలో ఒక బ్రహ్మాండ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజాగా టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈయన ఇంతకు ముందు విజయ్, శ్రీకాంత్, జీవాలతో ‘నన్భన్‌’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే అది హిందీ చిత్రం త్రీ ఇడియట్స్‌కు రీమేక్‌. కాగా తాజాగా శంకర్‌ తన సొంత కథతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 2.ఓ చిత్రం తరువాత శంకర్‌ నటుడు కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రం చేయడానికి సన్నాహాలు చేసిన విషయం, కమలహాసన్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ చిత్రం నిర్మాణం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్‌–2 చిత్రానికి ముందు ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు టాక్‌. ఇక ఇంతకీ ఆ మల్టీస్టారర్‌ ఎవరంటే ఇళయదళపతి విజయ్, సిమాన్‌ విక్రమ్‌ అని సమాచారం. ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఇంతకు ముందు శంకర్‌తో పని చేసిన వారే. విజయ్‌తో నన్భన్, విక్రమ్‌తో అన్నియన్, ఐ చిత్రాలను శంకర్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే శంకర్‌ మల్టీస్టారర్‌ చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారంలో నిజమెంత అన్నది అధికారకపూర్వమైన ప్రకటన వెలువడే వరకూ వేచి ఉండాల్సిందే. ఇలాంటి చిత్రం శంకర్‌ నుంచి రావాలని ఆయన అభిమానులు ఆశించడంలోనూ తప్పులేదు.

Advertisement
 
Advertisement
Advertisement