అన్నయ్య దర్శకత్వంలో ధనుష్‌ మూవీ | Dhanush Working With Selvaraghavan | Sakshi
Sakshi News home page

అన్నయ్యకు తమ్ముడి చేయూత

Jul 9 2019 8:32 AM | Updated on Jul 9 2019 8:32 AM

Dhanush Working With Selvaraghavan - Sakshi

చెన్నై : తనను హీరోగా చేసిన అన్నయ్యకు ఇప్పుడు తమ్ముడు చెయ్యి అందించడానికి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్, నటుడు ధనుష్‌ గురించే ఈ వార్త. తుళ్లువదో ఇళౖయె చిత్రంతో ధనుష్‌ను హీరోగా పరిచయం చేసింది ఆయన అన్న సెల్వరాఘవన్‌ అన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కాదల్‌ కొండాన్, పుదుపేటై వంటి చిత్రాలతో సెల్వరాఘవన్‌ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా నిలబెట్టాడు. ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్న ధనుష్, ఇటీవల సరైన సక్సెస్‌లు లేని తన అన్నయ్యకు చెయ్యి అందించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం.

సెల్వరాఘవన్‌ ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కించిన ఎన్‌జీకే చిత్రం నిరాశ పరిచింది. దీంతో ఆయన  ధనుష్‌ హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.ధాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈయన ధనుష్‌తో వరుసగా మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం అసురన్‌ చిత్రాన్ని ధనుష్‌ హీరోగా నిర్మిస్తున్నారు. దీని తరువాత మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇక మూడో చిత్రాన్ని సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో చేయనున్నట్లు తాజా సమాచారం.

ప్రస్తుతం ధనుష్‌ అరసన్‌ చిత్రంతో పాటు దురై సెంథిల్‌ దర్శకత్వంలో ఒక చిత్రం, కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం, మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించారు. వీటిలో వెట్ట్రిమారన్‌ దర్శకత్వంలో నటిస్తున్న అసురన్, దురైసెంథిల్‌ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. కాగా కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. అదే విధంగా మారి సెల్వరాజ్‌తో చిత్రం కూడా పూర్తయిన తరువాత తన అన్న సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ చిత్రం 2020లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే సెల్వరాఘవన్‌ ఇటీవల  పుదుపేట్టై  చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని ప్రకటించారు. బహుశా ఇదే అది అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement